లేబర్ కోడ్లు రద్దు చేయాల్సిందే..
ఖమ్మంలో కదంతొక్కిన కార్మికులు
సమ్మెలో భాగంగా భారీ ప్రదర్శన
ఖమ్మంమయూరిసెంటర్: కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మిక శక్తిని కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టేలా ఉన్నందున రద్దు చేయడమే కాక విద్యుత్, విత్తన సవరణ బిల్లులు, విబిజీరాంజీ చట్టం ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో కార్మికులు కదం తొక్కారు. దేశంలోని ప్రధాన పది కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా జిల్లాలో గురువారం సమ్మె నిర్వహించారు. ఇందులో భాగంగా ఖమ్మం పెవిలియన్ మైదానం నుండి జెడ్పీ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించగా కార్పొరేషన్ కార్మికులు, బ్యాంకు ఉద్యోగులు, మార్కెట్ హమాలీలు, సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సమ్మెకు రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి.
హక్కులను కాలరాస్తున్నారు..
బ్రిటిష్ కాలంలో కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలు, హక్కులను కేంద్రం కాలరాస్తోందని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. సమ్మెలో భాగంగా ఖమ్మంలోని పెవిలియన్ మైదానంలో కార్మిక సంఘాల అధ్యక్షులు గాదె లక్ష్మీనారాయణ, నరేష్ నాయుడు, కళ్యాణం వెంకటేశ్వరరావు, కె.శ్రీనివాస్, వెంకన్న, ఎండీవై. పాషా అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ.యూసుఫ్, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు, పోతినేని సుదర్శన్‌రావు, కాంగ్రెస్ నాయకులు నాగండ్ల దీపక్ చౌదరి, సీపీఎం, మాస్‌లైన్ జిల్లా కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, బీఆర్‌ఎస్ నాయకుడు గుండాల కృష్ణ మాట్లాడారు. దేశంలోని 50 కోట్ల మంది కార్మికుల హక్కులను ఒక శాతంగా కలిగిన కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు లేబర్ కోడ్లను తీసుకువచ్చారని ఆరోపించారు. ఇప్పటికే ప్రైవేటీకరణలో వేగం పెంచిన మోడీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ఈ పని చేస్తోందని మండిపడ్డారు. తక్షణమే లేబర్ కోడ్లను రద్దు చేసి పాత చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రదర్శనలో వివిధ సంఘాల నాయకులు జి.రామయ్య, కొండపర్తి గోవిందరావు, బీజీ.క్లెమెంట్, వై.విక్రమ్, తోట రామాంజనేయులు, రావి శివరామకృష్ణ, పోటు కళావతి, విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
లేబర్ కోడ్లు రద్దు చేయాల్సిందే..


