టెన్షన్.. టెన్షన్ !
● పోలింగ్ బూత్‌ల వద్దా విస్తృత ప్రచారం ● పోలింగ్ సరళిపై అంచనాల్లో అభ్యర్థులు ● ఎవరికి వారే గెలుపుపై ధీమా ● బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల జాతకం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో పోలింగ్ ముగియడంతో అభ్యర్థులు ఓటింగ్ సరళిపై అంచనాలు వేసుకుంటున్నారు. వారం రోజులుగా ప్రచారం, వ్యూహ, ప్రతివ్యూహాల్లో నిమగ్నమైన పార్టీ నేతలు, అభ్యర్థుల్లో ఇప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయోననే ఉత్కంఠ నెలకొంది. సత్తుపల్లి, మధిర, వైరా, ఏదులాపురం, కల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులొడ్డిన అభ్యర్థులు... పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఓటర్లను అభ్యర్థిస్తూ కనిపించారు. అంతకుముందు మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి ‘మంచి’ చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. ఈక్రమాన పలుచోట్ల డబ్బు, మద్యం ఏరులై పారింది.
ఎత్తులు.. పైఎత్తులు
మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు పడిన పాట్లు అన్నీఇన్ని కావు. ప్రత్యర్థులపై ఓ కన్నేసి ఉంచడమే కాక వారిని మించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. ప్రచారం ముగిసినప్పటి నుంచి అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెట్టారు. తమ అనుచరులను ఓటర్ల ఇళ్లకు పంపి ఓటు తప్పక వేసేలా ఒప్పించారు.
జోరుగా ప్రలోభాల పర్వం
మున్సిపల్ ఎన్నికలను అభ్యర్థులతోపాటు పార్టీల నేతలు కూడా అసెంబ్లీ ఎన్నికలకు మించి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో మద్యం, డబ్బు, బహుమతుల పంపిణీ విచ్చలవిడిగా సాగింది. ఒకరికి మించి మరొకరు ఓటుకు రూ.2 వేల నుంచి రూ.5వేల వరకు ఓటర్లకు అందజేశారు. కొన్ని మున్సిపాలిటీల్లో ఓ అభ్యర్థి ఓటుకు రూ.3వేలు చొప్పున ఇస్తే.. మరొకరు రూ.5 వేల చొప్పున ఇవ్వడం గమనార్హం. ప్రధానంగా చైర్‌పర్సన్ రేసులో ఉన్న అభ్యర్థులు మరింత ఎక్కువ ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఇక మద్యం, చికెన్, చీరలు వంటి బహుమతులు అదనంగా పంపిణీ చేశారు. అలాగే, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లకు ప్రయాణ ఖర్చులు కూడా చెల్లించడం విశేషం.
కునుకు లేకుండా..
బుధవారం ఉదయం పోలింగ్ మొదలుకానుండడంతో అభ్యర్థులు, వారి అనుచరులు మంగళవారం రాత్రి నిద్ర లేకుండానే గడిపారు. ఓటర్ల ఇళ్లకు వెళ్లి నిద్ర లేపి మరీ ప్రలోభాలతో ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నాలు చేశారు. కొన్ని చోట్ల ఓటర్లు ఇదే తరుణం అన్నట్లుగా తమకు కావాల్సినవి అడిగి మరీ తీసుకున్నారు. కొందరు ఓటర్లకు అభ్యర్థులే వాహనాలు సమకూర్చి పోలింగ్ బూత్‌ల వరకు తీసుకొచ్చారు. ఈ క్రమాన పోలింగ్ బూత్‌ల వద్ద కూడా విస్తృతంగా ప్రచారం చేయించారు. ఈ సమయంలోనే పోలింగ్ సరళిని గమనిస్తూ.. తమకు ఓటు వేసే వారెవరు, ఇప్పటివరకు ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయో అంచనాలు వేసుకున్నారు. అంతేకాక ఇంకా పోలింగ్ బూత్ రాని వారి ఇళ్లకు అనుచరులను పంపి పిలిపించారు.
సరళిపై పోస్ట్‌మార్టం
పోలింగ్ ముగిశాక అధికారులు బ్యాలెట్ బాక్స్‌లను స్ట్రాంగ్ రూమ్‌లోభద్రపరిచారు. ఈమేరకు పోలింగ్ సరళిపై అభ్యర్థులు పోస్టుమార్టమ్‌కు దిగారు. పోలింగ్ ఏజెంట్లు, కార్యకర్తలతో సమావేశమై ఒక్కో బూత్‌లో పరిస్థితి ఎలా ఉందనే అంశంపై చర్చించారు. బూత్‌ల వారీగా ఎన్ని ఓట్లు పోలయ్యాయి, అందులో తమకు ఎన్నిక వచ్చి ఉంటాయో అన్న లెక్కలు తీయడం మొదలుపెట్టారు. ఓటింగ్ సరళి, తాము చేసిన ప్రయత్నాలను బేరీజు వేసుకుంటున్న కొందరు గెలుపుపై ధీమాతో ఉన్నారు. అయినా కొందరిలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.


