ఆన్‌లైన్ బుకింగ్ మాకొద్దు
● మండ్రాజుపల్లిలో రైతుల ఆందోళన
నేలకొండపల్లి: యూరియా పంపిణీకి అమలుచేస్తున్న ఆన్‌లైన్ బుకింగ్ విధానంతో ఇబ్బందులు ఎదురవుతున్న రద్దు చేయాలని మంగళవారం రైతులు ఆందోళన చేపట్టారు. మండలంలోని మండ్రాజుపల్లి సొసైటీ వద్దకు చేరుకున్న రైతులు ఆన్‌లైన్ విధానం వల్ల సమస్యలు వస్తున్నందున రద్దు చేయాలంటూ యూరియా పంపిణీని అడ్డుకుని ధర్నాకు దిగారు. అందరి వద్ద స్మార్ట్‌ఫోన్లు లేనందున ఎలా బుకింగ్ చేసుకోవాలని నినాదాలు చేశారు. ఈమేరకు రైతులందరికీ అవసరం మేరకు యూరియా అందించాలని డిమాండ్ చేశారు.
యూరియా ఇక్కట్లు తీర్చాలి
తిరుమలాయపాలెం: యాప్‌లో బుక్ చేసుకోవడం కష్టంగా ఉందని, క్షణాల్లోనే స్లాట్లు అయిపోతున్న నేపథ్యాన రైతుల ఇక్కట్లు తీర్చాలని మండలంలోని గోల్‌తండాకు చెందిన కౌలు రైతు ఎం.డీ.సైదా తదితరులు కోరారు. తండాలో మొక్కజొన్న, వరి సాగు చేస్తుండగా ప్రస్తుత సమయంలో అవసరమైన యూరియా లభించడం లేదనివాపోయారు. యాప్ ద్వారా బుక్ చేసుకున్నా ఇప్పటివరకు ఎరువు అందలేదని తెలిపారు. ఇకనైనా అధికారులు స్పందించి గతంలో మాదిరి షాపుల్లో నేరుగా యూరియా విక్రయించాలని కోరారు.
సౌత్‌జోన్ అండర్–14 క్రికెట్ టోర్నీకి ఎంపిక
బోనకల్: మండలంలోని ఆళ్లపాడుకు చెందిన తోటకూర వంశీకృష్ణ–హారిక కుమారుడు ఉమేష్ సౌత్‌జోన్ ఇంటర్ స్టేట్ అండర్–14 బాలుర క్రికెట్ టోర్నీలో ఆడే రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్ అయిన ఉమేష్ తన స్థిరమైన ప్రదర్శనతో సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని విజ్ఞాన్‌జ్యోతి స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్న ఉమేష్‌ను ఈసందర్భంగా పలువురు అభినందించారు.
రూ.4.60 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
అశ్వాపురం: బైక్‌పై ఇద్దరు వ్యక్తులు గంజాయి తరలిస్తుండగా మండలంలోని మొండికుంటలో మంగళవారం ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఎస్‌ఐ శ్రీహరిరావు ఆధ్వర్యాన తనిఖీ చేస్తుండగా, అశ్వాపురం వైపు బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించారు. వీరి వద్ద రూ.4.60 లక్షల విలువైన ఏడు కేజీల గంజాయి లభించింది. సూర్యాపేట జిల్లా తెల్లబెల్లికి చెందిన బడేటి వెంకటేశ్, ఏపీలోని కృష్ణా జిల్లా వెంగనాయకునిపాలెంనకు చెందిన మోరుబోయిన గోపయ్య.. ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. వీరిని మణుగూరు ఎకై ్సజ్ పోలీసులకు అప్పగించారు. తనిఖీల్లో హెడ్‌కానిస్టేబుళ్లు సుధీర్, వెంకట్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.


