గెలుపే లక్ష్యం కావాలి..
● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ● ఉత్సాహంగా జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడాపోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: క్రీడాకారులు ప్రతీసారి గెలుపే లక్ష్యంగా శ్రమిస్తే తప్పక ఫలితం ఉంటుందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. అయితే, ఓటమి ఎదురైనప్పుడు నిరాశ చెందకుండా లోటుపాట్లను తెలు సుకుంటే విజయాలు సొంతమవుతాయని చెప్పారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడాపోటీలను కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. పోటీలకు ఐదు నియోజకవర్గాల నుంచి 1,200 మంది క్రీడాకారులు హాజరవడం అభినందనీయమన్నారు. అందరికీ ప్రతిభ చాటాలనే తపన ఉన్నా కొందరికే విజయం సొంతమవుతుందని తెలిపారు. ఆపై శిక్షణపై దృష్టి సారించాలని సూచించారు. గత ఏడాది జరిగిన సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు 47 పతకాలను సాధించిన నేపథ్యాన ఈసారి సంఖ్య పెరగాలన్నారు. ఖమ్మంలో త్వరలోనే మరో ఆధునిక స్టేడియం నిర్మించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, డీఈఓ చైతన్య జైనీ, కోచ్‌లు, క్రీడా అసోసియేషన్ బాధ్యులు ఎండీ.గౌస్, ఉదయ్‌కుమార్, కె.ఆదర్శ్‌కుమార్, కె.క్రిస్టోఫర్‌బాబు, వై.రామారావు, బొంతే శ్రీనివాస్, ఎండీ.షఫీక్ అహ్మద్, వీవీఎస్.సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.
స్టేడియంలో కోలాహలం
జిల్లాస్థాయి పోటీలకు హాజరైన క్రీడాకారులతో పటేల్ స్టేడియంలో సందడి నెలకొంది. వివిధ కేటగిరీల్లో నిర్వహించిన కబడ్డీ, ఖో–ఖో, అథ్లెటిక్స్, హ్యాండ్‌బాల్, వాలీబాల్, ఫుట్‌బాల్, టేబుల్ టెన్నిస్ తదితర పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభ చాటారు. క్రీడాకారులకు స్టేడియంలో తాగునీటి వసతితో పాటు భోజనాలు సమకూర్చారు.
అథ్లెటిక్స్‌లో విజేతలు వీరే...
సీఎం కప్ జిల్లాస్థాయి పోటీలను అండర్–16, 20 బాలబాలికల విభాగాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా అథ్లెటిక్స్‌కు సంబంధించి అండర్–16 బాలుర 60 మీటర్ల పరుగులో ఆర్.మోహన్, ఎస్.కే.ఉమర్ ఫారూఖ్, ఏ.నాగరాజు, 600 మీటర్ల పరుగులో గోపాలకృష్ణ, విజయరామ అరవింద్, ఈశ్వర్, జావెలిన్ త్రోలో టి.సందీప్, బి.సందీప్, కొండ, షాట్‌పుట్‌లో కె.వెంకట్రావు, బి.సందీప్, వి.రాంచరణ్ వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. బాలికల షాట్‌పుట్‌లో జోషికా, గౌరీప్రియ, స్రవంతి, జావెలిన్ త్రోలో ఆమ్ములు, శ్రీలక్ష్మి, పవిత్ర, 600 మీటర్ల పరుగులో నక్షత్ర, ఎం.డీ.ఆఫ్రిన్, దీక్ష, పురుషుల 400 మీటర్ల పరుగులో ఎస్.గోపీచంద్, ఎన్.వినయ్‌కుమార్, ఎం.కళ్యాణ్ వరుసగా మూడు స్థానాలు దక్కించుకున్నారు. అలాగే, 800 మీటర్ల పరుగు బాలికల అండర్–20 విభాగంలో ఎస్.కే.ఆఫ్రిన్, బాలుర విభాగంలో అబ్దుల్ రజాక్, 200 మీటర్ల పరుగులో డి.వివేక్‌చంద్ర, కృష్ణమనోహర్, సురేష్, అండర్–18 బాలికల షాట్‌పుట్‌లో బి.వైశాలి, సాబా తబసుమ్, శ్రావణి, మహిళల 100 మీటర్ల పరుగులో ఎ.మైథిలి, ఎం. మనీషా విజేతలుగా నిలిచారు.
గెలుపే లక్ష్యం కావాలి..


