జాబ్‌మేళాలో 15 మంది ఎంపిక
ఖమ్మం రాపర్తినగర్: ఖమ్మం టేకులపల్లిలోని ప్రభుత్వ మోడల్ కెరీర్ సెంటర్‌లో మంగళవారం నిర్వహించిన జాబ్‌మేళాలో 15 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. బీమా కంపెనీలో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన మేళాకు 65 మంది హాజరుకాగా ఇంటర్వ్యూ అనంతరం 15మందిని ఎంపిక చేసినట్లు జిల్లా ఉపాధి కల్ప న శాఖ అధికారి కొండపల్లి శ్రీరాం తెలిపారు.
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
నేలకొండపల్లి: ఈనెల 25నుంచి జరగనున్న ఇంటర్‌మీడియట్ వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఇంటర్‌మీడియట్ విద్యాశాఖాధికారి(డీఐఈఓ) కె.రవిబాబు తెలిపారు. నేలకొండపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రాక్టికల్ పరీక్షలను మంగళవారం తనిఖీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. వార్షిక పరీక్షలకు జిల్లాలో 66 కేంద్రాలు ఏర్పాటు చేయగా, 35,188 మంది విద్యార్ధులు హాజరుకానున్నారని తెలిపారు. ఇందులో మొదటి సంవత్సరం 17,467, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 17,721మంది ఉన్నారని పేర్కొన్నారు. ప్రశ్నాపత్రాలను పోలీస్‌స్టేషన్ల నుంచి ఎస్కార్ట్ మధ్య పరీక్ష ప్రశ్నాపత్రాలు తరలించడమే కాక ప్రతీ కేంద్రంలో సీసీ కెమెరాలు అమరుస్తున్నామని తెలిపారు. హాల్‌టికెట్లను విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని డీఐఈఓ వెల్లడించారు. కాగా, ప్రాక్టికల్ పరీక్షలు బుధవారం ముగియనుండగా, జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించామని తెలిపారు. ఆయన నేలకొండపల్లి కాలేజీ ప్రిన్సిపాల్ ఎల్.వెంకటేశ్వర్లు ఉన్నారు.
వ్యవసాయ రంగంలో పీహెచ్‌డీ
కామేపల్లి: లక్ష్యాన్ని చేరేందుకు గ్రామీణ నేపథ్యం అడ్డంకి కాదని చెబుతూ శాస్త్రవేత్తగా ఎదగడమే ధ్యేయంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదులుకున్న మండలంలోని సాతానిగూడెం గ్రామానికి చెందిన పేలపూడి హిమబిందు వ్యవసాయ రంగంలో పీహెచ్‌డీ సాధించింది. ఉప్పు నీటి ఆధారంగానూ సాగయ్యే వరి వంగడాలపై ఆమె చేసిన పరిశోధనలకు హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ డాక్టరేట్‌ను ప్రకటించగా వీసీ జానయ్య చేతుల మీదుగా అందుకుంది. భర్త సిరిపురపు వెంకటేష్‌చౌదరి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్న ట్లు వెల్లడించిన హిమబిందు... ఐకార్–ఐఐఆర్‌ఆర్, ఐకార్–ఐఐఓఆర్‌లో పరిశోధకురాలిగా సేవలందించడమే కాక గతంలో యంగ్ సైంటి స్ట్, యంగ్ రీసెర్చర్ అవార్డులు గెలుచుకుంది.
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆ తర్వాత స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని ఆంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
విజయేంద్రప్రసాద్ పూజలు..
శ్రీ సీతారామచంద్రస్వామి వారిని సినీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తండ్రి, ఎంపీ విజయేంద్రప్రసాద్ దర్శించుకున్నారు. ఆయనకు ఈఓ దామోదర్‌రావు స్వాగతం పలకగా అర్చకులు వేదాశీర్వచనం చేసి, స్వామివారి జ్ఞాపిక, ప్రసాదం అందజేశారు.
జాబ్‌మేళాలో 15 మంది ఎంపిక


