ఐటీడీఏలో ఇక డీడీఈఓ ! | - | Sakshi
Sakshi News home page

ఐటీడీఏలో ఇక డీడీఈఓ !

Feb 11 2026 7:24 AM | Updated on Feb 11 2026 7:24 AM

ఐటీడీఏలో ఇక డీడీఈఓ !

ఐటీడీఏలో ఇక డీడీఈఓ !

● గిరిజన విద్య బలోపేతానికి సర్కారు నిర్ణయం ● డిప్యుటేషన్‌పై సీనియర్‌ హెచ్‌ఎంలకు బాధ్యతలు ● గతంలో సేవలందించిన ఏజెన్సీ డీఈఓలు

● గిరిజన విద్య బలోపేతానికి సర్కారు నిర్ణయం ● డిప్యుటేషన్‌పై సీనియర్‌ హెచ్‌ఎంలకు బాధ్యతలు ● గతంలో సేవలందించిన ఏజెన్సీ డీఈఓలు

భద్రాచలం: గిరిజన విద్య బలోపేతానికి కృషి చేస్తున్న ప్రభుత్వం ఐటీడీఏల పరిధిలో డిప్యూటీ డీఈఓలను నియమించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఐటీడీఏ పరిధి పాఠశాలలను గిరిజన సంక్షేమ శాఖ డీడీ పర్యవేక్షిస్తుండగా.. వారిపై విధుల భారం, ఒత్తిడి పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో ఏజెన్సీ డీఈఓ పోస్టు ఉండేది. జిల్లాల పునర్విభజనలో ఈ పోస్టు జిల్లాకు తరలిపోవడంతో ఆ స్థానాన్ని డిప్యూటీ డీఈఓ పోస్టుతో భర్తీ చేయనుంది.

2016లో పోస్టు మాయం

భద్రాచలం ఐటీడీఏ పరిధిలో గతంలో ఏజెన్సీ డీఈఓ పోస్టు ఉండేది. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు, బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లు, గిరిజన గురుకులాలను సదరు అధికారి పర్యవేక్షించేవారు. అయితే 2016లో జిల్లాల పునర్విభజనలో భాగంగా భద్రాచలం ఏజెన్సీ డీఈఓ పోస్టును జిల్లా విద్యాశాఖాధికారి పోస్టుగా అప్‌గ్రేడ్‌ చేశారు. అప్పటి నుంచి డీఈఓ పరిధిలోనే అన్నిరకాల విద్యా సంస్థలు పనిచేస్తున్నాయి. చివరి ఏజెన్సీ డీఈఓగా రవీందర్‌బాబు బాధ్యతలు నిర్వర్తించారు.

నిరాశ పరుస్తున్న ఫలితాలు

ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో 2016 తర్వాత ఫలితాలు నిరాశపరుస్తున్నాయి. పాఠశాలల పర్యవేక్షణ గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిధిలోకి వెళ్లడం, ఆ అధికారికి ఇతర శాఖల పర్యవేక్షణ, ఒత్తిడితో పాఠశాలలపై దృష్టి పెట్టలేకపోయారు. ఇక డీడీలు ఉద్యోగ విరమణ చెందినప్పుడు ఏపీఓ జనరల్‌కు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించడం, మళ్లీ నూతన డీడీ రాగానే విధులు బదలాయించడం.. ఇలా రకరకాల కారణాలతో పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడుతోంది. దీంతోనే ఐటీడీఏలో డిప్యూటీ డీఈఓలను నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం. గిరిజన సంక్షేమ శాఖలోని సీనియర్‌ ప్యానల్‌ గ్రేడ్‌ హెచ్‌ఎంను డిప్యుటేషన్‌పై ఈ పోస్టులో నియమించనుండగా, ఆశ్రమ, ప్రాథమిక పాఠశాలల్లో బోధనపై పర్యవేక్షణ, విద్యా ప్రమాణాల పెంపు బాధ్యతలు వీరికి అప్పగించనున్నారు.

పీఓ కల సాకారమయ్యేనా ?

భద్రాచలం ఐటీడీఏ పీఓగా రాహుల్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రాథమిక విద్యార్థుల్లో లోపించిన తెలుగు, గణితం, సైన్స్‌ నైపుణ్యాలు, ప్రాథమిక అంశాలను పెంపొందించేందుకు ఉద్దీపనం, ప్రాక్టీస్‌ బుక్‌లు తయారుచేశారు. అయితే విద్యాశాఖలో అధికారి పోస్టు లేక పర్యవేక్షణకు పూర్తి స్థాయిలో సమయం కేటాయించలేకపోతున్నారు. ప్రస్తుతం డిప్యూటీ డీఈఓ పోస్టు భర్తీ అయితే గిరిజన విద్యావ్యవస్థను బలోపేతం చేయాలనే పీఓ కల సాకారం అయ్యే అవకాశం ఉంది. కాగా గిరిజన ఆశ్రమ పాఠశాలలను భద్రాచలం, దమ్మపేట, ఇల్లెందు డివిజన్లుగా విభజించారు. ఐటీడీఏ పరిధిలో 50 ఆశ్రమ పాఠశాలలు, 3 బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలలు ఉండగా, గిరిజన గురుకులాలు భద్రాద్రి జిల్లాలో 21, ఖమ్మం జిల్లాలో ఆరు ఉన్నాయి. కాగా, డిప్యూటీ డీఈఓ పోస్టు భర్తీ విషయమై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఆదేశాలు రాలేదని ఐటీడీఏ ఏపీఓ జనరల్‌ డేవిడ్‌రాజ్‌ తెలిపారు. అయితే, తాము గతంలో ఉన్న డీఈఓ పోస్టును భర్తీ చేయాలని కొన్నాళ్ల క్రితమే ప్రభుత్వానికి నివేదించామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement