●పోలింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు
సత్తుపల్లి/కల్లూరు రూరల్: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో పోలింగ్ సజావుగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేశామని.. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల్లో ఉద్యోగులకు సామగ్రి పంపిణీ కేంద్రాలతో పాటురిసెప్షెన్, స్ట్రాంగ్‌రూం, కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను ఆయన మంగళవారం పరిశీలించారు. పోలింగ్ నిర్వహణ, ఆతర్వాత బ్యాలెట్‌బాక్స్‌ను స్ట్రాంగ్‌రూంకు తరలించే విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఉద్యోగులకు సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించగా.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశామని తెలిపారు. వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఉంటుందని, సెన్సిటివ్ కేంద్రాల్లో పరిశీలనలకు మైక్రో అబ్జర్వర్లను నియమించామని వెల్లడించారు. ఈనేపథ్యాన ప్రజలు ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని కలెక్టర్ కోరారు. ఆయన వెంట కల్లూరు సబ్‌కలెక్టర్ అజయ్ యాదవ్, తహసీల్దార్ లక్ష్మి, మున్సిపల్ కమిషనర్లు నర్సింహ, ఎం.రామదుర్గారెడ్డి, వివిధ శాఖల అధికారులు నాగేశ్వరరావు, చంద్రశేఖర్, రామకృష్ణ, చలపతిరావు, కృష్ణ, నందిశెట్టి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి


