ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి
ఖమ్మం సహకారనగర్: ప్రజలు అందించే ఫిర్యాదులు, వినతిపత్రాలను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు.కలెక్టరేట్‌లో సోమవారం ఆయన ప్రజావాణిలో భాగంగా అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డితో కలిసి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమై పరిష్కారంపై సూచనలు చేశారు.
● ఆర్థిక అంశాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండడమే కాక ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా అవగాహన కల్పించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఆర్థిక అక్షరాస్యతపై రూపొందించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించాక ఆయన మాట్లాడారు.
● ప్రారంభ దశలో కేన్సర్‌ను గుర్తిస్తే చికిత్స చేయించుకుని మెరుగైన జీవనం పొందొచ్చని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. యువికెన్ ఫౌండేషన్ బాధ్యులు డాక్టర్ షహనాజ్‌బాను ఆధ్వర్యాన బ్రెస్ట్ కేన్సర్ నిర్ధారణ యంత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 30ఏళ్లు దాటినా మహిళా ఉద్యోగుల పరీక్షల కోసం క్యాంపు నిర్వహిస్తామని తెలిపారు. కేన్సర్ నిర్ధారణ యంత్రం సమకూర్చిన బాధ్యులను అభినందించారు.
● సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్‌ఐసీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఖమ్మం రిక్కాబజార్ పాఠశాలలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఈమేరకు ఆయన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశాల్లో డీఆర్వో పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, ఎల్‌డీఎం ఏ.రవిప్రసాద్, టీజీబీ రీజినల్ మేనేజర్ ఏ.ప్రసన్న కుమార్, ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ శ్రీరామ్ బరన్, డీఎంహెచ్‌ఓ రామారావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ చందునాయక్, జిల్లా ఇన్ఫర్మేటిక్ అధికారి ప్రసాద్, ఉద్యోగులు భిక్షు, హరిబాబు, వినయ్, సతీష్ పాల్గొన్నారు.
గ్రీవెన్స్ డేలో కలెక్టర్ అనుదీప్


