మోడల్‌ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా.. | - | Sakshi
Sakshi News home page

మోడల్‌ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా..

Feb 10 2026 7:26 AM | Updated on Feb 10 2026 7:26 AM

మోడల్‌ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా..

మోడల్‌ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా..

ఏ స్థాయిలో ఉన్నా మధిరే నా ప్రాణం

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మధిర: మధిరను రాష్ట్రంలోనే మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఏ స్థాయికి ఎదిగినా మధిరను ప్రాణంగా భావించే తాను ఇక్కడి ప్రజలకు ఏ అవసరం వచ్చినా తీర్చేందుకు సిద్ధంగా ఉంటానని తెలిపారు. మధిర మున్సిపల్‌ పరిధిలోని పలు వార్డుల్లో సోమవారం ఎన్నికల ప్రచారం చేయగా, రోడ్‌ షోల్లో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నందున మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపిస్తే మధిర పట్టణ అభివృద్ధికి సానుకూలంగా ఉంటుందని తెలిపారు. గతంలో పదేళ్లు తాము అధికారంలో లేకపోగా, అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ సైతం నిధులు మంజూరు చేయలేదన్నారు. ఇప్పుడు తాను డిప్యూటీ సీఎంగానే కాక ఆర్థిక, విద్యుత్‌, ప్రణాళిక శాఖలు చూస్తున్నందున మధిర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఈమేరకు రాజకీయ కోణంలో కాకుండా మంచి పాలకవర్గం ఎన్నికయ్యేలా కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థులను గెలిపించాలని భట్టి కోరారు. ఎన్నికలు ముగిశాక అన్ని వర్గాల నుంచి రాజకీయాలకు అతీతంగా ప్రముఖులను ఎంపిక చేసి పట్టణ అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేస్తామని, వారి సూచనలతో పనులు చేపడుతామని తెలిపారు.

ఓటు వృథా కానివ్వొద్దు..

మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడమే కాక పరిశ్రమల ఏర్పాటుకు శిక్షణ ఇప్పిస్తామని భట్టి వెల్లడించారు. అలాగే, ఇండస్ట్రియల్‌ పార్కులో వారికి ప్రత్యేకంగా స్థలాలు కేటాయిస్తామన్నారు. మధిర ఓటర్లు ఓటు వృథా చేయకుండా అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాగా, పేదలకు రేషన్‌కార్డుల మంజూరు, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్‌ అమలుచేస్తున్న తమను మున్సిలిటీల్లోనూ గెలిపించి మరింత బలం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాగా, మధిర డిగ్రీ కళాశాలలో అంబేద్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయగా, వరదల సమయాన ఇక్కట్లు ఎదురుకాకుండా రిటైనింగ్‌ వాల్‌ నిర్మిస్తున్నామని తెలిపారు. అలాగే, ఈదురు గాలులు వచ్చినా రెప్పపాటు కూడా కరెంట్‌ పోకుండా అండర్‌ గ్రౌండ్‌ కేబుల్‌ వ్యవస్థతో పాటు అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ వ్యవస్థ అందుబాటులోకి రానుందని భట్టి వివరించారు. కాగా, మధిర 16, 17, 18, 19వ వార్డుల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రోడ్డు షోలు నిర్వహించచగా అభ్యర్థులతో పాటు పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement