సత్తుపల్లికి ప్రత్యేక స్థానం.. | - | Sakshi
Sakshi News home page

సత్తుపల్లికి ప్రత్యేక స్థానం..

Feb 10 2026 7:26 AM | Updated on Feb 10 2026 7:26 AM

సత్తుపల్లికి ప్రత్యేక స్థానం..

సత్తుపల్లికి ప్రత్యేక స్థానం..

● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ● సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం

● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ● సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం

సత్తుపల్లి/కల్లూరు రూరల్‌: ‘ఎప్పుడు ఏం చేయాలి.. ఎవరిని గెలిపించాలో సత్తుపల్లి ఓటర్లకు తెలిసినంత ఎవరికీ తెలియదు.. అంతలా సత్తుపల్లికి ప్రత్యేక బ్రాండ్‌ ఉంది’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మరో మూడేళ్లు రేవంత్‌రెడ్డి నేతృత్వాన ప్రభుత్వమే కొనసాగనున్నందున ప్రజలకు ఏం కావాలన్నా చేసేది తామేనని తెలిపారు. సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ అభ్యర్థుల తరఫున సోమవారం నిర్వహించిన రోడ్డు షోల్లో ఎమ్మెల్యే డాక్టర్‌ మట్టా రాగమయి దయానంద్‌తో కలిసి పాల్గొన్న మంత్రి పలుచోట్ల మాట్లాడారు. సత్తుపల్లి అభివృద్ధికి సీఎంను ఒప్పించి మరిన్ని నిధులు సాధిస్తానని తెలిపారు. కళ్ల ముందు కనిపిస్తున్న శాశ్వతమైన అభివృద్ధి పనులను ప్రజలు గుర్తించాలని కోరారు. వచ్చే తొలకరికల్లా యాతాలకుంట టన్నెల్‌ పూర్తి చేసి వేశ్యకాంతచెరువులోకి గోదావరి జలాలు నింపడమే కాక వేంసూరుకు పంపిస్తామని తెలిపారు. త్వరలోనే బుగ్గపాడు ఫుడ్‌పార్క్‌ను సైతం పూర్తి చేసి 3వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా కార్యాచరణ రూపొందించామని మంత్రి వెల్లడించారు. ఇక కల్లూరు అభివృద్ధి కోసమే డివిజన్‌ కేంద్రంగా ఏర్పాటు చేశామని, ఆతర్వాత మున్సిపాలిటీగా మార్చామని తెలిపారు. గ్రీన్‌ఫీల్డ్‌ హైవే కాకుండా కల్లూరులోనే నాలుగు లేన్ల రహదారి ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. కల్లూరు మండలం చెన్నూరులో రూ.200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ మంజూరు చేశామని తెలిపారు. రెండు మున్సిపాలిటీల్లో వంద శాతం కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించడం ద్వారా మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి తుమ్మల వెల్ల డించారు. ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ గత పదిహేను ఏళ్ల పాలనలో అభివృద్ధి కాగితాలకే పరిమితం కాగా, నిధులు విడుదల చేయకుండా శంకుస్థాపనలతోనే సరిపుచ్చారని విమర్శించారు. అబద్ధాలు, మోసాలతో కాలం గడిపారని, సింగరేణి సైలోబంకర్‌ వల్ల ప్రాణాలు పోయిన కుటుంబాలను ఏనాడైనా పరామర్శించారా అని నిలదీశారు. రూ.50 కోట్లతో సత్తుపల్లి పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేలా ప్రణాళిక ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ప్రచారంలో నాయకులు డాక్టర్‌ మట్టా దయానంద్‌, పొంగులేటి ప్రసాద్‌రెడ్డితో పాటు చల్లగుళ్ల నర్సింహారావు, ఎండీ.కమల్‌పాషా, తోట సుజలరాణి, బొంతు సుమలత, గ్రాండ్‌ మౌలాలీ, మందపాటి ప్రభాకర్‌రెడ్డి, దూదిపాల రాంబాబు, కర్నాటి విజయకుమారి, చావా స్వరూపారాణి, మట్టా ప్రసాద్‌, పసుమర్తి చందర్‌రావు, అంకిరెడ్డి సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement