ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం సహకారనగర్: మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించగా జిల్లా నుంచి కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, ఎన్నికల పరిశీలకుడు పవన్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఏర్పాట్లను కలెక్టర్ వివరిస్తూ ఉద్యోగుల నియామకం, శిక్షణ పూర్తయిందని తెలిపారు. అలాగే, మున్సిపాలిటీల్లో సామగ్రి పంపిణీకి ఏర్పాట్లు చేశామని, అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రత ఉంటుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
ఐదు మున్సిపాలిటీలు.. 117 వార్డులు
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 117 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఇందుకోసం 295 మంది చొప్పున పోలింగ్ అధికారులు, ఏపీఓలతో పాటు 910 ఓపీఓలను నియమించామన్నారు. అంతేకాక 26 మంది జోనల్ అధికారులు, 38 మంది రూట్ అధికారులు విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. మున్సిపాలిటీల వారీగా డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.
లోటుపాట్లు ఎదురుకావొద్దు
ఖమ్మంరూరల్: మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులకు సామగ్రి పంపిణీలో లోపాలు ఎదురుకావొద్దని కలెక్టర్ అనుదీప్ సూచించారు. ఏదులాపురం మున్సిపాలిటీకి సంబంధించి పెద్దతండాలోని ప్రియదర్శిని కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షెన్, కౌంటింగ్ కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. మంగళవారం ఉదయం నుంచే ఉద్యోగులు చేరుకుంటారని, వీరికి పోలింగ్ బాక్స్‌లు, సామగ్రి సరిచూశాక అందించాలని తెలిపారు. ఆపై వాహనాల్లో కేంద్రాలకు చేర్చాలని పేర్కొన్నారు. వాహనాలు సమకూర్చడంతో పాటు భోజన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. ఈకార్యక్రమాల్లో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ముజాహిద్, రిటర్నింగ్ అధికారి నవీన్‌బాబు, తహసీల్దార్ రాంప్రసాద్, మున్సిపల్ కమిషనర్ అలీ తదితరులు పాల్గొన్నారు.


