సాగునీటి కోసం రైతుల ఆందోళన
కొణిజర్ల: మొక్కజొన్న పంట చేతికొచ్చే సమయాన సాగర్ జలాలను నిలిపివేయడంతో రైతులు ఆందోళనకు దిగారు. ఎన్నెస్పీ గుబ్బగుర్తి, అంజనాపురం మేజర్ కాల్వలకు వారబందీ పేరుతో అధికారులు నీటిసరఫరా నిలిపి వేశారు. దీంతో మొక్కజొన్న, తదితర పంటలు ఎండిపోతున్నాయని అంజనా పురం, రామచంద్రాపురం, రాంపురం, గుబ్బగుర్తి రైతులు గుబ్బగుర్తిలో సోమవారం రహదారిపై బైఠాయించారు. సమస్య పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని పేర్కొనగా, ఏన్కూరు, పల్లిపాడు రహదారిలో వాహనాలు నిలిచిపోయాయి. ఈ విష యం తెలుసుకున్న పోలీసులు చేరుకుని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు. కాగా, ఆయా కాల్వలకు నీరు విడుదల చేసినట్లు అధికారులు ప్రకటించారు.
గుబ్బగుర్తిలో రాస్తారోకో


