రైలుకింద పడి వ్యక్తి మృతి
బోనకల్: బోనకల్ రైల్వేస్టేషన్ సమీపంలో గోవిందాపురం(ఎల్) గ్రామానికి చెందిన ఇరుగు నాగేశ్వరరావు(60) ఆదివారం ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. నాగేశ్వరరావు భార్య కరోనా సమయంలో మృతి చెందగా, ఇద్దరు పిల్లలను ఆయనే అన్నీ తానై పోషిస్తున్నాడు. కాగా, ఆయన ఖమ్మం వెళ్లి బోనకల్ రాగా గ్రామానికి వెళ్లడానికి బ్రిడ్జి పైనుంచి కాకుండా ట్రాక్ దాటే ప్రయత్నంలో ఒకే సమయాన రెండు ట్రాక్‌లపై రైళ్లు వస్తుండడంతో గమనించక మృత్యువాత పడ్డాడు.
వ్యక్తి అనుమానాస్పద మృతి
ఖమ్మంఅర్బన్: బల్లేపల్లిలోని ఓ మద్యం దుకాణంలో ఆదివారం రాత్రి వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. మద్యం దుకాణం వెనుక ఉన్న ఓ గదిలో మృతదేహాన్ని గుర్తించిన కొందరు యజమానికి తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, చిమ్మపూడి గ్రామానికి చెందిన కొల్లు శ్రీను (30)గా గుర్తించారు. అయితే, మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కుటుంబ సభ్యులు వచ్చే లోపే మద్యం దుకాణం నిర్వాహకులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కాగా, ఈ మద్యం దుకాణంలో నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయని, ఒకరిపై ఒకరు దాడి చేయడం సర్వసాధారణంగా మారిందని స్థానికులు చెబుతున్నారు.
దాడి చేసిన వ్యక్తిపై కేసు
కూసుమంచి: మండలంలోని నాయకన్‌గూడెం గ్రామంలో శనివారం ఓ వ్యక్తిని బీరు బాటిల్‌తో కొట్టి తీవ్రంగా గాయపర్చిన ఘటనలో ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ నాగరాజు కథనం మేరకు.. గ్రామానికి చెందిన అమ్మటి శివయ్య (శివ) తన బంధువు దశదిన కర్మకు హాజరై భోజనం చేస్తుండగా అదే గ్రామానికి చెందిన అమ్మటి ఉదయ్ బీరు సీసాతో దాడి చేశాడు. గాయపడిన శివను ఆస్పత్రికి తరలించారు. పాత కక్షల నేపథ్యంలోనే దాడి జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. బాధతుడి భార్య ఫిర్యాదు మేరకు ఉదయ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రైలుకింద పడి వ్యక్తి మృతి


