అభ్యర్థుల గుర్తులు ఇవే..
సత్తుపల్లిటౌన్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ పత్రాల పరిశీలన ప్రక్రియ ముగిసింది. ఈ నెల 3వ తేదీతో నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగుస్తుంది. ఆ తర్వాత బీ–ఫామ్ అందిన అభ్యర్థులకు పార్టీల గుర్తులను ఎన్నికల అధికారులు కేటాయిస్తారు. మిగిలిన ఇండిపెండెంట్ల కోసం 75 గుర్తులను ఎన్నికల సంఘం విడుదల చేసింది. వీరికి అక్షర క్రమంలో గుర్తులు కేటాయిస్తారు.
జాతీయ, రాష్ట్ర పార్టీల గుర్తులు ఇలా..
జాతీయ పార్టీలో బీజేపీ (కమలం), కాంగ్రెస్ (హస్తం), ఆమ్‌ఆద్మీ (చీపురు), బీఎస్‌పీ (ఏనుగు), ఇండియన్ ముస్లీం లీగ్ (నిచ్చెన), సీపీఎం (సుత్తి కొడవలి, నక్షత్రం) గుర్తులు ఉన్నాయి. రాష్ట్ర పార్టీ ల్లో ఏఐఎంఐఎం (గాలిపటం), బీఆర్‌ఎస్ (కారు), వైఎస్‌ఆర్‌సీపీ (ఫ్యాన్), టీడీపీ (సైకిల్), రిజిస్టర్ పార్టీల్లో ఫార్వర్డ్ బ్లాక్ (సింహం), సీపీఐ (కంకి కొడవలి), జనసేన (గాజుగ్లాసు) గుర్తులు ఉన్నాయి.
స్వతంత్రుల గుర్తులు..
స్వతంత్ర అభ్యర్థులకు 75 గుర్తులు కేటాయిస్తూ ఎన్నికల సంఘం విడుదల చేయగా.. ఇందులో యాపిల్, గాజులు, ఎయిర్ కండీషన్, బ్యాట్, సీసా, బెలూన్, కెమెరా, బకెట్, ఫుట్‌బాల్ తదిర గుర్తులు ఉన్నాయి.
మున్సిపాలిటీల్లో ఇలా..
ఏదులాపురం మున్సిపాలిటీలో 32 వార్డులకు 202 మంది అభ్యర్థులకు గాను 206నామినేషన్లు, వైరాలో 20వార్డులకు 155మంది అభ్యర్థులకు గాను 155నామినేషన్లు, సత్తుపల్లిలో 23 వార్డులకు 124 మంది అభ్యర్థులకు 128 నామినేషన్లు, కల్లూరులో 20 వార్డులకు 130 మంది అభ్యర్థులకు గాను 132 నామినేషన్లు, మధిరలో 22 వార్డులకు 165 మంది అభ్యర్థులకు గాను 165 నామినేషన్లను పరిగణనలోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ఏదులాపురంలో 16 మంది, వైరా, సత్తుపల్లిలో 14 మంది చొప్పున, కల్లూరులో ఆరుగురు, మధిరలో నలుగురు ఇండిపెండెంట్లు నామినేషన్లు వేశారు.
ఇండిపెండెంట్లకు 75 గుర్తులు


