మధిర పాలన‘ఆమె’ చేతుల్లోనే
● రెండు దశాబ్దాలుగా మహిళల నేతృత్వాన పాలకవర్గాలు ● ఈసారి కూడా అతివలకే రిజర్వేషన్
మధిర: గ్రామపంచాయతీగా, నగర పంచాయతీగానే కాక మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయ్యాక మధిరలో గత రెండు దశాబ్దాల నుంచి పాలన మహిళల నేతృత్వంలోనే కొనసాగుతోంది. 2006 సంవత్సరంలో మధిర మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో కాంగ్రెస్ తరఫున న్యాయవాది వాసంశెట్టి కోటేశ్వరరావు సతీమణి లక్ష్మీప్రియ విజయం సాధించి 2011 వరకు కొనసాగారు. ఆతర్వాత ప్రత్యేక అధికారుల పాలన కొనసాగగా, నాటి ఉమ్మడి ఏపీలో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న మల్లు భట్టి విక్రమార్క 2013 మార్చి 28న నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ చేయించారు. ఆ సమయంలో మధిర జీపీలో మడుపల్లి, ఇల్లెందులపాడు, అంబారుపేట గ్రామాలు విలీనమయ్యాయి. నగర పంచాయతీ మొదటి చైర్ పర్సన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మొండితోక నాగరాణి గెలిచి 2019 వరకు కొనసాగారు. ఆ తర్వాత జిలుగుమాడు గ్రామాన్ని విలీనం చేస్తూ 2018 మార్చి 24న మధిర మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. ప్రత్యేక అధికారుల పాలన అనంతరం 2020 జనవరి 22న మధిర మున్సిపాలిటీకి తొలిసారి ఎన్నికలు జరగ్గా టీఆర్‌ఎస్ తరపున పోటీ చేసిన కౌన్సిలర్ మొండితోక లత గెలిచి చైర్ పర్సన్ పదవి దక్కించుకున్నారు. ఆమె 2025 వరకు పనిచేశారు. దీంతో మేజర్ జీపీగా, నగర పంచాయతీగానే కాక మున్సిపల్ తొలి చైర్మన్ పదవి మహిళకే దక్కడంతో ఇరవై ఏళ్ల పాటు అతివల చేతిలోనే పాలన సాగినట్లయింది.
ఈసారి జనరల్ మహిళకు...
ప్రస్తుతం మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి మధిర చైర్‌పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో మధిర పీఠాన్ని మహిళే దక్కించుకోనున్నారు. అంటే మరో ఐదేళ్లు.. తద్వారా 25ఏళ్ల మధిర పాలన మహిళ చేతుల్లో కొనసాగినట్లవుతుంది. దీనికి తోడు ప్రభుత్వం మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కేటాయించడంతో కౌన్సిలర్లు సైతం సగం మంది మహిళలే కొలువుదీరనున్నారు. కాగా, మధిర మున్సిపల్ పరిధిలో మొత్తం 25,679 మంది ఓటర్లు ఉండగా, ఇందులో మహిళలే 13,424 కావడం విశేషం. పురుషులు 12251 మందితో పాటు ఇతరులు నలుగురు ఉన్నారు.
మధిర పాలన‘ఆమె’ చేతుల్లోనే


