విద్యను సరుకుగా మార్చారు...
పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభల్లో ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ
ఖమ్మంమయూరిసెంటర్: ప్రస్తుత విద్యావ్యవస్థ లక్ష్యం తప్పగా.. కార్పొరేటీకరణ, మతోన్మాదం పేరుతో విద్యారంగాన్ని ధ్వంసం చేస్తున్నారని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మంలో జరుగుతున్న పీడీఎస్‌యూ రాష్ట్ర 23వ మహాసభలు శనివారం రెండో రోజుకు చేరగా ప్రతినిధుల సభలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ఒకప్పుడు ఉపయోగపు విలువ కలిగిన విద్యకు మారకపు విలువ కల్పించి వ్యాపారంగా మార్చారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణతో ఉద్యోగాలు పోతే, ఆ నిందను చరిత్రపై వేయడం విడ్డూరమన్నారు. స్కూళ్లను పబ్లిక్–ప్రైవేట్–పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) కింద ఇచ్చేస్తామనడం ప్రభుత్వ విద్యా వ్యవస్థను చంపేయడమేనని తెలిపారు. విద్యారంగానికి బడ్జెట్ పెరిగితే వ్యాపారీకరణ తగ్గుతుందని తెలిసినా పాలకులు నిధులు తగ్గిస్తున్నారని తెలిపారు. దేశంలో శాసీ్త్రయ, ప్రజాస్వామ్య విద్య తద్వారా సమానత్వ సమాజ ఏర్పాటు కోసం అన్ని వర్గాల ప్రజలు పోరాడాలని లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి వి.మనోహర్‌రాజు మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థలను చెప్పు చేతుల్లో పెట్టుకొని ప్రజల హక్కులు, ప్రశ్నించే గొంతులను అణచివేస్తోందని ఆరోపించారు.
ఖమ్మం నుంచే పోరాటం
దేశంలో ప్రజాస్వామ్య విలువలపై జరుగుతున్న దాడిని అడ్డుకోకపోతే భవిష్యత్‌లో రాజ్యాంగం కనుమరుగయ్యే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ హెచ్చరించారు. పీడీఎస్‌యూ మహాసభల్లో ఆయన మాట్లాడుతూ కేవలం చదువుకోని వారి వల్లే ఫాసిజం వస్తుందనుకోవడం భ్రమేనని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యతను పార్టీలకే ఇవ్వకుండా పౌర సమాజం ముందుకు రావాలని సూచించారు. ఖమ్మం వంటి చైతన్యవంతమైన ప్రాంతాల నుంచే పోరాటం మొదలవ్వాలని ఆకాంక్షించారు. తొలుత సంఘం పతాకాన్ని రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ ఆవిష్కరించగా అమరవీరులను స్మరిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను గుమ్మడి నర్సయ్య సినీ డైరెక్టర్ పరమేశ్ హివ్రాలే ప్రారంభించి మాట్లాడారు. ఈ సభల్లో అరుణోదయ కళాకారులు ఆలపించిన గీతాలు ఆలోచింపచేశాయి. ఈ కార్యక్రమాల్లో ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడు ఐవీ.రమణారావు, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్, నాయకులు ఎం.నరేందర్, ఎర్ర అఖిల్, బి.నరసింహరావు, వి.వెంకటేష్, లక్ష్మణ్, ఎస్.రాకేష్, ఎం.సాయి, కావ్య, దీక్షిత, అనూష, జి.సురేష్, వి.వెంకటేష్, అలువాల నరేష్, అంగిడి కుమార్, మునిగేల శివప్రసాద్, బి.అజయ్, అషూర్, వి.కావ్య, పి.అనూష, గుమ్మడి చైతన్య, దీక్షీత, సీతారాం, మధు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
పీపీపీ విధానమంటే ప్రభుత్వ విద్యకు శరాఘాతమే
విద్యను సరుకుగా మార్చారు...


