నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10–30 గంటలకు మంత్రి ఖమ్మం చేరుకుంటారు. మధ్యాహ్నం 2–30 గంటలకు ఖమ్మం కలెక్టరేట్‌లో జరిగే కార్యక్రమంలో శిక్షణ పొందిన ల్యాండ్ సర్వేయర్లకు లైసెన్సులు అందిస్తారు. ఆతర్వాత ఏదులాపురం ము న్సిపల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
ఖమ్మం మార్కెట్‌కు జాతర సెలవులు
ఖమ్మంవ్యవసాయం: ములుగు జిల్లా మేడారంలో జరగనున్న సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల అభ్యర్థనతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవులు ప్రకటించారు. ఈనెల 29న గురువారం, 30న శుక్రవారం మేడారం జాతర సెలవులు ఇవ్వగా, 31న శనివారం, ఫిబ్రవరి 1 ఆదివారం వారాంతపు సెలవులు రానున్నాయి. దీంతో వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. తిరిగి ఫిబ్రవరి 2వ తేదీ సోమవారం మార్కెట్ పునఃప్రారంభమవుతుందని వెల్లడించారు.
జమలాపురం ఆలయంలో ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి మూలవిరాట్‌తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి వేదమంత్రాల నడుమ పంచామృతంతో అభిషేకం చేశారు. అలాగే, స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి నిత్యకల్యాణం, పల్లకీ సేవ నిర్వహించగా తెలుగు రాష్ట్రాల భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకున్నారు. కాగా, ఆలయంలో ఆదివారం రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నట్లు ఈఓ జగన్మోహన్‌రావు, ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ తెలిపారు. ఈకార్యక్రమంలో ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
గన్నీ బ్యాగ్‌లు భద్రపర్చండి
● అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో నిల్వ ఉన్న గన్నీబ్యాగుల పటిష్టంగా భద్రపర్చాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లో శనివారం ఆయన గోదాం మేనేజర్లతో సమావేశమై మాట్లాడారు. బంగ్లాదేశ్ నుంచి జూట్ దిగుమతికి ఆటంకాలు ఏర్పడినందున, రబీ ధాన్యం కొనుగోళ్లకు కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. గోదాంలో బ్యాగ్‌లను భద్రపర్చడమే కాక రేషన్ షాపుల నుంచి సేకరించాలని సూచించారు. వీటిని ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు తరలించి సీసీ కెమెరాల నీడలో భద్రపర్చాలని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈసమావేశంలో జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలత, గోదాంల మేనేజర్లు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
రిటైనింగ్ వాల్ పరిశీలన
ఖమ్మంఅర్బన్: మున్నేటికి ఇరువైపులా నిర్మిస్తు న్న రిటైనింగ్ వాల్ పనులను క్వాలిటీ కంట్రోల్ ఎస్‌ఈ సీహెచ్.బుచ్చిరెడ్డి శనివారం పరిశీలించారు. నిర్మాణ పనులు, ఉపయోగిస్తున్న సామగ్రి నాణ్యతపై ఆరా తీశాక ఇంజనీర్లకు సూచనలు చేశారు. పనుల్లో నాణ్యత పాటించేలా అనునిత్యం పరిశీలించాలని సూచించారు. ఎక్కడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు. ఖమ్మం ఎస్‌ఈ మంగళపూడి వెంకటేశ్వర్లు, ఈఈలు, డీఈలు అనన్య, వెంకటరమణకుమార్, చంద్రమోహన్, ఉదయ్ ప్రతాప్ పాల్గొన్నారు.


