షోరూంలోనే వాహన రిజిస్ట్రేషన్
● జిల్లాలో అమల్లోకి నూతన విధానం ● ఉదయం కొనుగోలు చేస్తే సాయంత్రానికి పూర్తి ● జిల్లా రవాణాశాఖాధికారి జగదీష్
ఖమ్మంక్రైం: వాహనాలు కొనుగోలు చేసేవారు రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖా కార్యాలయానికి రావాల్సిన అవసరం ఉండదు. కార్లు, ద్విచక్రవాహనాలు కొనుగోలు చేసిన వారు ఇకపై షోరూంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసుకోవచ్చు. రవాణా శాఖ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ విధానం శనివారం నుంచి ఖమ్మంతో పాటు వైరా, సత్తుపల్లి రవాణా శాఖ కార్యాలయాల్లో అందుబాటులోకి వచ్చిందని జిల్లా రవాణా శాఖాధికారి జగదీష్ తెలిపారు. ఈమేరకు ఆయన వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.
డీలర్ల ద్వారా దరఖాస్తు
శుక్రవారం వరకు కొనుగోలు చేసిన వాహనాలకు మాత్రం రవాణా శాఖ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ జరుగుతుందని డీటీఓ తెలిపారు. అలాగే, వాణిజ్య వాహనాలకు సంబంధించి రవాణా శాఖ కార్యాలయానికే రావాలని పేర్కొన్నారు. మిగతా వాహనాల(కార్లు, ద్విచక్రవాహనాలు)కు షోరూం డీలర్లే శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తారని తెలిపారు. వాహనదారుడు షోరూమ్‌లో ఉదయం వాహనాన్ని కొనుగోలు చేస్తే సాయంత్రానికి శాశ్వత రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని తెలిపారు. ఒకవేళ సాయంత్రం కొనుగోలు చేస్తే మరుసటి రోజు ప్రక్రియ చేస్తారని పేర్కొన్నారు. ఇందుకోసం అవసరమైన పత్రాల(ఇన్వాయిస్ ఫారం–21, 22,, ఇన్సూరెన్స్, చిరునామా ధ్రువీకరణ పత్రం, వాహనాల ఫొటో)లను డీలర్లే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయనుండగా.. రవాణా శాఖ కార్యాలయంలో పరిశీలించి రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తామని తెలిపారు. ఆపై గతంలో మాదిరిగానే స్పీడ్ పోస్ట్ ద్వారా వాహన యజమానికి కార్డు చేరుతుందని చెప్పారు. ఈ ప్రక్రియలో వాహనదారులకు సమస్యలు ఎదురైతే ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయం ద్వారా ఉద్యోగులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌తోపాటు ఇతర సేవలపై పూర్తిగా దృష్టి సాధించే అవకాశముంటుంటుందని డీటీఓ వెల్లడించారు. కాగా నిత్యం ఖమ్మం, వైరా, సత్తుపల్లిలో సుమారు 200 రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా, ఇందులో వంద వరకు షోరూమ్‌ల్లో జరగనున్నాయి.


