కూరగాయలు.. గ్యారంటీ లాభాలు
ఆదాయం పక్కా
● వాణిజ్య పంటల స్థానంలో సాగుపై రైతుల దృష్టి ● ఎకరానికి రూ.80 వేల నికర ఆదాయం ● వైరా డివిజన్‌లోనే 436 ఎకరాల్లో సాగు
ఏన్కూరు: అధిక పెట్టుబడులు పెట్టి వాణిజ్య పంటలు సాగు చేసినా ప్రతికూల వాతావరణం, చీడపీడల కారణంగా సరైన దిగుబడి, లాభాలు రాక అప్పుల పాలవుతున్న రైతులు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమ, తక్కువ కాలంలో అధిక దిగుబడి, లాభాలు వచ్చే కూరగాయల సాగుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూరగాయల సాగు ఏటేటా పెరుగుతోంది.
మూడు నెలల్లో చేతికి..
కూరగాయలు సాగు కోసం ఎకరానికి రూ.30 వేల పెట్టుబడి అవసరమవుతోంది. ఈ పంట మూడు నెలలో చేతికి వస్తుండగా ఖర్చులు పోగా ఎకరానికి రూ.80 వేల మేర ఆదాయం వస్తోంది. ఈ నేపథ్యాన వైరా డివిజన్ పరిధిలో ఈ ఏడాది 436 ఎకరాల్లో కూరగాయల సాగు చేస్తున్నారు. ఇందులో అత్యధికంగా కారేపల్లి మండలంలో 110 ఎకరాల్లో సాగవుతుండగా, వైరా, కొణిజర్ల, ఏన్కూరు, జూలూరుపాడు మండలాల్లో సాగు ఊపందుకుంది. ఏన్కూరు మండలంలోని హిమామ్‌నగర్, అక్కినాపురం తండా, భగవాన్‌నాయక్ తండా, శ్రీరాంపురం తండా, సూర్యతండా, రాజులపాలెం, ఎర్రబోడు తండా, గార్లఒడ్డు, జన్నారం గ్రామాల్లో రైతులు బోడ కాకరకాయ, కాకరకాయ, బీరకాయ, వంకాయ, బెండకాయ, గోరుచిక్కుళ్లు, క్యాబేజీ, కాలీఫ్లవర్, చిక్కుడు కాయ, సోరకాయ, దోస కాయ, టామాట తదితరాలు సాగుచేస్తున్నారు.
తక్కువ కాలంలో నిత్యం ఆదాయం వచ్చే కూరగాయలపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తుండడంతో ఇటు దృష్టి సారిస్తున్నారు. కోతుల బెడద తగ్గితే కూరగాయల సాగు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
–ఆకుల వేణు, వైరా డివిజన్ ఉద్యాన అధికారి
1.20 ఎకరాల్లో కూరగాయల సాగు చేశా. ఒకటి కాకుండా కాలిప్లవర్, చిక్కుడుకాయ, టమాటా, వంకాయ, బెండకాయ, కాకరసాగు వేస్తే రూ.లక్ష వరకు పెట్టుబడి అయింది. రోడ్డు పక్కనే అమ్ముతుండడడంతో ప్రతీరోజు ఎంతో కొంత ఆదాయం వస్తోంది.
–బానోతు రావుజా, రైతు, హిమామ్‌నగర్
వంకాయ, బెండకాయ, టామాటా పంటల ద్వారా ఎకరానికి రూ.80 వేల వరకు ఆదాయం వస్తోందని రైతులు చెబుతున్నారు. బోడ కాకరకాయ, కాకరకాయ, చిక్కుడు కాయ తదితరాల ద్వారా ఎకరానికి రూ.లక్ష వరకు ఆదాయం సాధిస్తున్నారు. కూరగాయల సాగు మూడు నెలల్లో పూర్తికావడం, రైతుకు ప్రతీరోజు ఆదాయం వస్తుండడంతో సాగుపై మక్కువ చూపుతున్నారు. కొందరు రైతులు కూరగాయలను మార్కెట్‌కు తరలిస్తుండగా, మరికొందరు పొలాల వద్ద రోడ్డు వెంట అమ్ముతుండడంతో తాజా కూరగాయలకు మంచి ఆదరణ లభిస్తోంది.
కూరగాయలు.. గ్యారంటీ లాభాలు
కూరగాయలు.. గ్యారంటీ లాభాలు
కూరగాయలు.. గ్యారంటీ లాభాలు


