ఎప్పుడైనా మేం రెడీ!
సిబ్బందికి శిక్షణ ప్రారంభం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితాపై వచ్చిన అభ్యంతరాలు పరిష్కరించి తుది జాబితా విడుదల చేశాం. పోలింగ్‌స్టేషన్ల వారీగా కూడా ఓటర్ల వివరాలను ప్రచురించాం. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 242 పోలింగ్ కేంద్రాలు, 43 నామినేషన్ సెంటర్లు, ఐదు కౌంటింగ్ సెంటర్లను గుర్తించాం. ఎప్పుడు షెడ్యూల్ విడుదలైనా ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాం.’ అని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల అంశంపై ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కలెక్టర్ వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే..
● మున్సిపల్ పోలింగ్ స్టేషన్లు, నామినేషన్, కౌంటింగ్ సెంటర్లు సిద్ధం ● ఇప్పటికే తుది ఓటర్ల జాబితా విడుదల ● పీఓ, ఏపీఓ, ఆర్‌ఓ, ఏఆర్‌ఓలు, జోనల్ ఆఫీసర్ల కేటాయింపు ● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఏదులాపురంలో ఎక్కువ..
మున్సిపాలిటీల వారీగా తొలుత ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశాం. దీనిపై అభ్యంతరాలు అందాయి. కొత్త మున్సిపాలిటీ కావడంతో పేర్లు తారుమారు అయ్యాయని, ఇతర అంశాలపై ఏదులాపురం మున్సిపాలిటీ నుంచే ఎక్కువ అభ్యంతరాలు వచ్చాయి. దీంతో పాటు మధిర, కల్లూరు, వైరా, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో అందిన అభ్యంతరాలను అధికారులు పరిష్కరించాక తుది ఓటర్ల జాబితా విడుదల చేశారు.
ఐదు నుంచి ఎనిమిది కేంద్రాలు
సత్తుపల్లి, మధిర, వైరా, ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీల పరిధిలో ఏర్పాటు చేసే కేంద్రాల్లో రిటర్నింగ్ ఆఫీసర్లు నామినేషన్లు స్వీకరిస్తారు. ఒక మున్సిపాలిటీకి 5 – 8 నామినేషన్ సెంటర్లు ఉంటాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక వీటి వివరాలు వెల్లడిస్తాం. మొత్తం 242 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశాం. ఇందులో 25 సెన్సిటివ్, 32 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను గుర్తించాం. పోలింగ్ ముగిశాక బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌కు తరలిస్తాం. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఒకటి, రెండు రోజుల విరామం తర్వాత లెక్కింపు ఉంటుంది. అన్ని పోలింగ్ స్టేషన్లు, స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ సెంటర్లలో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటుచేయనున్నాం.
ఉద్యోగుల కేటాయింపు
ఎన్నికల నిర్వహణకు ఉద్యోగుల కేటాయింపు కూడా పూర్తి చేశాం. అవసరమైన 241 మంది పీఓలకు గాను 20శాతం అదనంగా 50 మందిని కేటాయించాం. దీంతో మొత్తం 291 మంది అందుబాటులో ఉంటారు. అలాగే ఓపీఓలు 789 మందికి గాను అదనంగా 159తో కలిపి 948 మందిని గుర్తించాం. రిటర్నింగ్ అధికారులు 43 మందికి గాను 12 మంది అదనంగా, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు 43మందికి తోడు అదనంగా 12మందిని కేటాయించాం. అలాగే, 26 మంది జోనల్ ఆఫీసర్లతో పాటు పది ఫ్లయింగ్‌స్క్వాడ్‌లు, పది స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను నియమించాం.
డిస్ట్రిబ్యూషన్, లెక్కింపు కేంద్రాల గుర్తింపు
అధికారుల సమన్వయంతో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ సెంటర్‌గా పెద్దతండాలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీ, కల్లూరు మున్సిపాలిటీలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రంగా రైతువేదిక కాంప్లెక్స్, ఎంపీడీఓ కార్యాలయం, రిసెప్షన్, కౌంటింగ్ సెంటర్‌గా ప్రభుత్వ జూనియర్ కాలేజీని ఎంపిక చేశాం. మధిరలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ సెంటర్‌గా ఖాజీపురలోని ప్రభుత్వ పాలిటెక్నికల్ కాలేజీ, వైరాలో వెటర్నరీ హాస్పిటల్, సత్తుపల్లిలో జ్యోతి నిలయంను ఎంపిక చేశాం. ఈ ఎన్నికల్లో పార్టీల వారీగా గుర్తులు ఉంటాయి. స్వతంత్ర అభ్యర్థులకు క్రమపద్ధతిలో గుర్తులు కేటాయిస్తాం. ఒక బ్యాలెట్ పేపర్‌పై 16 గుర్తులు ముద్రించి, అంతకంటే ఎక్కువగా ఉంటే రెండో బ్యాలెట్ పేపర్ ఉపయోగిస్తాం. రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖల నుంచి అధికారులను సమన్వయం చేసుకుంటున్నాం.
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి గురువారం నుంచి శిక్షణ ఇస్తున్నాం. రిటర్నింగ్ ఆఫీసర్లు, పీఓ(పోలింగ్ ఆఫీసర్లు), ఏపీఓ (అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు)లు శిక్షణలో పాల్గొంటున్నారు. పరీక్షల దష్ట్యా ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉద్యోగులు, అత్యవసర సేవల్లో ఉన్న అంగన్‌వాడీ టీచర్లను మినహాయించాం. సుమారు 20 శాతం సిబ్బందిని రిజర్వ్‌లో ఉంచాం. ఐదు మున్సిపాలిటీల్లో 482 బ్యాలెట్స్ బాక్సులు అందుబాటులో ఉన్నాయి. అదనంగా 98 బాక్స్‌లు రిజర్వ్‌లో పెట్టుకున్నారు. ఒక్కో పోలింగ్ స్టేషన్‌లో 700 – 800 మంది ఓటర్లు ఉంటారు.
ఎప్పుడైనా మేం రెడీ!


