ఆ నలుగురిలోఎవరు
పదవి..
ప్రతిష్టాత్మకం
జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు కొత్త సారథి
తుది దశకు చేరిన ఏఐసీసీ కసరత్తు
డీసీసీ అధ్యక్ష పీఠంపై ఎవరు కూర్చోనున్నారో మరికొద్ది రోజుల్లో తేలనుంది. జిల్లా నుంచి దరఖాస్తు చేసుకున్న 56మందిలో చివరికి నలుగురు నేతల పేర్లు ఏఐసీసీ పరిశీలిస్తోంది. పార్టీకి విధేయత, సామాజిక సమీకరణాలు.. తదితర
అంశాలను పరిగణనలోకి తీసుకుని అధ్యక్ష పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే అంశంలో ఏఐసీసీ చేపట్టిన కసరత్తు తుది దశకు చేరిందని సమాచారం. మధిర నియోజకవర్గానికి చెందిన వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైరా నియోజకవర్గం నుంచి నూతి సత్యనారాయణ, పాలేరు నియోజకవర్గం నుంచి మద్ది శ్రీనివాసరెడ్డి, ఖమ్మం నియోజకవర్గం నుంచి మానుకొండ రాధాకిషోర్ పేర్లు రేసులో ఉన్నట్లు
తెలుస్తుండగా.. ఎవరికి పదవి దక్కుతుందోననే ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం
మద్ది శ్రీనివాసరెడ్డి
మానుకొండ రాధాకిషోర్
నూతి సత్యనారాయణ
వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి
అంతా వడపోసి..
ఏఐసీసీ పరిశీలకుడు మహేంద్రన్ గత నెల 11 నుంచి 19 వరకు ఐదు నియోజకవర్గాల్లో పర్యటించారు. ఓ వైపు ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకుంటూనే మరోవైపు ముఖ్య నేతలతో సమావేశమై అధ్యక్ష పదవికి ఎవరైతే సమర్ధులంటూ ఆరా తీశారు. అంతేకాక దరఖాస్తుదారులతో నేరుగా మాట్లాడి అధ్యక్ష పదవి ఎందుకు ఆశిస్తున్నారు, పదవి వస్తే పార్టీని మరింతగా ఎలా బలోపేతం చేస్తారు.. అనే అంశాలపై సమీక్షించారు. ఆతర్వాత మంత్రుల అభిప్రాయాన్ని కూడా తీసుకుని ఏఐసీసీకి నివేదిక ఇచ్చారు. దరఖాస్తులన్నింటినీ వడపోసి పార్టీకి చాలా కాలంగా విధేయులుగా ఉన్న వారిలో ఆరుగురి పేర్లను ప్రతిపాదించారు. చివరకు ఇందులో నుంచి నలుగురి పేర్లతో జాబితా సిద్ధమైనట్లు తెలిసింది.
సామాజిక సమీకరణాలు
డీసీసీ అధ్యక్ష పదవి ఇప్పటి వరకు ఏ సామాజికవర్గానికి దక్కింది.. పార్టీలో సీనియర్లుగా ఉన్న ఏ సామాజికవర్గానికి పదవి దక్కలేదనే అంశాలను ఏఐసీసీ పరిశీలకుడు మహేంద్రన్ ఆరా తీసినట్లు సమాచారం. ఈ మేరకు వెల్లడైన వివరాల ఆధారంగా దరఖాస్తు చేసుకున్న వారిలో ఏ సామాజిక వర్గానికి డీసీసీ పదవి ఇస్తే మంచిదనే అంశాన్ని ముఖ్య నేతలు మహేంద్రన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇవన్నీ కాక జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఏకాభిప్రాయాన్ని కూడా అధిష్టానం కీలకంగా భావిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యాన అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వారిలో మంత్రుల ఆశీస్సులు ఎవరికి ఉంటాయనే చర్చ కాంగ్రెస్ పార్టీ శ్రేణులో జరుగుతోంది.
జర్నీ అంతా కాంగ్రెస్‌లోనే..
డీసీసీ రేసులో నలుగురు ఉండగా వీరంతా తొలి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. మధిర మండలం మడుపల్లి గ్రామానికి చెందిన వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌తోనే కాక మధిర మార్కెట్ చైర్మన్ పదవి నిర్వర్తించారు. అలాగే వైరాకు చెందిన నూతి సత్యనారాయణ ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్ బాధ్యతలు చూశారు. ప్రస్తుతం టీపీసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు గ్రామ వాసి, న్యాయవాది డాక్టర్ మద్ది శ్రీనివాసరెడ్డి ఎన్‌ఎస్‌యూఐ, యువజన్ కాంగ్రెస్‌కు సంబంధించి రాష్ట్ర స్థాయి పదవులు నిర్వర్తించారు. ప్రస్తుతం టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. గతంలో పలుమార్లు కాంగ్రెస్ నుంచి పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించారు. ఇక ఖమ్మం అర్బన్ మండలం బాలపేట గ్రామానికి చెందిన మానుకొండ రాధాకిషోర్ కూడా పార్టీ పరంగా యువజన, ఎన్‌ఎస్ యూఐ బాధ్యతలు చూశారు. అలాగే ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో డీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకోవడం ఆశావహులకు ప్రతిష్టాత్మకమైంది. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండడంతో పదవి ఎవరికి దక్కుతుందన్నది హాట్‌టాపిక్‌గా మారింది. ఒక్కసారి ఎంపికై తే ఐదేళ్లు పార్టీ సారథిగా ఉండే అవకాశం దక్కడం.. మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ముఖ్య నేతలు, కేడర్‌ను సమన్వయం చేసుకుంటూ సాగే పదవి కావడంతో ఎవరికి వారు తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం బిహార్ రాష్ట్ర ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పార్టీ శ్రేణులంతా బిజీగా ఉన్న నేపథ్యాన ఆయా ఎన్నికలు ముగిశాక డీసీసీ అధ్యక్షుల ప్రకటన ఉంటుందని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
డీసీసీ పదవికి పరిశీలనలో వేమిరెడ్డి, నూతి, మద్ది, మానుకొండ
ఆ నలుగురిలోఎవరు


