ఫిర్యాదులను పరిష్కరించండి
పకడ్బందీగా చేప పిల్లల పంపిణీ
‘గ్రీవెన్స్ డే’లో అదనపు కలెక్టర్ శ్రీజ
ఖమ్మం సహకారనగర్: ప్రజలు అందించే ప్రతీ ఫిర్యాదును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణిలో భాగంగా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి ఆమె ఫిర్యాదులు, వినతపత్రాలను స్వీకరించారు. ఆతర్వాత అధికారులతో సమావేశమైన శ్రీజ పరిశీలన, పరిష్కారంపై సూచనలు చేయగా, ఏవైనా దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు సరైన కారణాలు చెప్పాలని సూచించారు. ఈకార్యక్రమంలో డీఆర్వో పద్మశ్రీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
● జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించిన ఆమె విద్యాసంస్థలను ఈనెల 7లోగా శుభ్రం చేయాలన్నారు. అలాగే, అవసరమైన చోట్ల కిచెన్ షెడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు ఇవ్వాలని, మధ్యాహ్న భోజనం నాణ్యతపై నివేదిక సమర్పించాలని తెలిపారు. అంతేకాక ప్రతీ విద్యార్థికి ఆధార్ కార్డు, అపార్ నంబర్ కేటాయించడమే కాక ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్లు తీసుకోవాలని సూచించారు. డీఆర్‌ఓ ఏ.పద్మశ్రీ, జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగపద్మజ, వివిధ శాఖల అధికారులు జి.జ్యోతి, ముజాహిద్, విజయలక్ష్మి, ప్రవీణ్, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా, అక్టోబర్‌లో ఉద్యోగ విరమణ చేసిన వివిధ శాఖ ఉద్యోగులు బి.అన్నమ్మ, జె.జాన్సన్, వి.ఉమాదేవి, గోపాల్, బుచ్చయ్య, అభిమన్యుడును సన్మానించారు.
● ఖమ్మంవైద్యవిభాగం: దివ్యాంగులకు ఇబ్బంది ఎదురు కాకుండా సదరమ్ సేవలు అందించాలని అదనపు కలెక్టర్ శ్రీజ ఆదేశించారు. జిల్లా జనరల్ ఆస్పత్రిలో సదరమ్ విభాగాన్ని పరిశీలించిన ఆమె ప్రత్యేక షెడ్డు, టాయిలెట్ల నిర్మాణంపై సూచనలు చేశారు. ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఎం.నరేందర్‌తో పాటు అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.
ఖమ్మంవ్యవసాయం: జలాశయాల్లో నాణ్యమైన చేపపిల్లలు విడుదల చేసేలా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య శాఖల మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఇప్పటికే ఆలస్యమైనందున ఈనెల 20వ తేదీనాటికి లక్ష్యం మేర నీటి వనరుల్లో చేప పిల్లల విడుదల చేయాలని తెలిపారు. అలాగే, టీ–మత్స్య యాప్‌లో చేప పిల్లలు, సరఫరాదారులు, రవాణా చేసే వాహనం వివరాలను పొందుపర్చాలని చెప్పారు. అంతేకాక ప్రతీ రిజర్వాయర్‌కు అధికారులను బాధ్యులుగా నియమించి పిల్లలు పంపిణీ చేసే కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని మంత్రి సూచించారు. ఈ వీసీలో జిల్లా నుంచి హాజరైన అదనపు కలెక్టర్ శ్రీజ అధికారులతో సమావేశమై షెడ్యూల్ తయారీపై సూచనలు చేశారు. జిల్లా మత్స్య శాఖ అధికారి శివప్రసాద్, జిల్లా నీటిపారుదల అధికారి వెంకట్రామ్ తదితరులు పాల్గొన్నారు.


