ఖమ్మంలీగల్: పెండింగ్ కేసుల పరిష్కారమే లక్ష్యంగా ఈనెల15న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి.రాజగోపాల్ తెలిపారు. జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్‌లో సోమవారం జరిగిన పోలీసు, బ్యాంకర్లు, చిట్ ఫండ్ ప్రతినిధులు, అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రిమినల్, ఇతర కేసులు రాజీ చేసుకోవాలనుకునే వారికి లోక్ అదాలత్ వేదికగా నిలుస్తుందన్నారు. ప్రమాద కేసులను రాజీ చేసుకుంటే ఒకేసారి పరిహారం అందుతుందని తెలిపారు. ఈ విషయమై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో న్యాయాధికారులు ఉమాదేవి, వెంపటి అపర్ణ, ఎం.అర్చనాకుమారి, దేవినేని రాంప్రసాదరావు, ఎం.కల్పన, శివరంజని, టి.మురళీమోహన్, కాట్రగడ్డ దీప, బి.రజని, బిందు ప్రియ, మాధవి, నాగలక్ష్మి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు టి.వెంకటేశ్వరరావు, సభ్యులు న్యాయవాదులు శ్రీనివాసరావు, సంధ్యారాణి, అదికారులు పాల్గొన్నారు. తొలుత బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఆధ్వర్యాన న్యాయవాదులతో సమావేశం నిర్వహించగా జిల్లా జడ్జి జి.రాజగోపాల్, న్యాయమూర్తి ఉమాదేవి పాల్గొని సూచనలు చేశారు.
పెద్దాస్పత్రిలో ఎలక్ట్రానిక్ టోకెన్ వ్యవస్థ
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఎలక్ట్రానిక్ టోకెన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చినట్లు మెడికల్ సూపరింటెండెంట్ ఎం.నరేందర్ తెలిపారు. ఆస్పత్రిలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చికిత్స కోసం వచ్చే వారు ఇబ్బంది పడకుండా ఆస్పత్రి, ఎంసీహెచ్‌లో ఎలక్ట్రానిక్ టోకెన్ సిస్టమ్ ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. ఓపీ రిజిస్ట్రేషన్ స్లిప్ తీసుకున్నాక హెల్ప్‌డెస్క్ వద్దకు వెళ్తే హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యాన శిక్షణ పొందిన వలంటీర్లు టోకెన్లు ఇస్తారని తెలిపారు. ఆపై గైనకాలజీ, అల్ట్రాసౌండ్, ల్యాబొరేటరీ, పీడియాట్రిక్ విభాగాల వద్ద టీవీ స్క్రీన్లపై కనిపించే నంబర్ ఆధారంగా చికిత్స చేయించుకోవచ్చని వెల్లడించారు. తద్వారా గదుల వద్ద గుంపులుగా వేచి ఉండే పరిస్థితి తప్పుతుందని సూపరింటెంటెంట్ తెలిపారు. కాగా, హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ఆధ్వర్యాన 20 త్రీ సీటర్ బెంచీలు, పదేసి వీల్‌చైర్లు, స్ట్రెచర్లు, షూ ర్యాక్‌లు అందిజేసినట్లు ప్రతినిధి ముజ్తబా హసన్ ఆస్కరీ తెలిపారు.
ఉపకార వేతనాల
కోసం దరఖాస్తులు
ఖమ్మంమయూరిసెంటర్: 2024–25 ఏడాదికి గాను జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న బీసీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఈ– పాస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జి.జ్యోతి తెలిపారు. విద్యార్థులు https:// telanganaepass. cgg. gov. in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేరుకుని, ఆదాయం, కుల ధ్రువపత్రాలు, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్ జతపరచాలని సూచించారు. ఆతర్వాత దరఖాస్తు కాపీకి సర్టిఫికెట్లు జత చేసి తమ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు.
వృత్తి నైపుణ్య శిక్షణకు
దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మం రాపర్తినగర్: జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యాన ఇచ్చే వృత్తి నైపుణ్య శిక్షణకు యువతీ, యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి తెలిపారు. మూడు నెలల పరిమితితో కంప్యూటర్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ ఉంటుందని వెల్లడించారు. ఆసక్తి ఉన్న ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలోని జిల్లా యువజన క్రీడల శాఖ కార్యాలయంలో కానీ 99482 07271 నంబర్‌లో కానీ సంప్రదించాలని సూచించారు.
మ్యానువల్ స్కావెంజర్లు లేని జిల్లాగా ప్రకటన
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో మ్యానువల్ స్కావెంజర్లు లేనట్లు ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో జిల్లాలో పరిశీలన చేపట్టడమే కాక నివేదికపై అభ్యంతరాలు స్వీకరించారు. ఎలాంటి అభ్యంతరాలు అందకపోవడంతో జిల్లాను మ్యానువల్ స్కావెంజింగ్ రహితంగా ప్రకటించినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు.
15న ప్రత్యేక లోక్ అదాలత్


