బకాయిలు చెల్లించే వరకు కాలేజీలు బంద్
ఖమ్మం సహకారనగర్: వృత్తి విద్యా కళాశాలల్లో చదివిన విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసేంత వరకు నిరవధిక బంద్ కొనసాగిస్తామని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ప్రకటించాయి. ఈమేరకు సోమవారం కళాశాలల గేట్లకు తాళాలు వేసి బంద్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ మేరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరారు. ఇంజనీరింగ్, డిగ్రీ, వృత్తి విద్య కళాశాలల విద్యార్థులకు మూడేళ్లుగా రీయింబర్స్‌మెంట్ బకాయిలు రాకపోవడంతో కళాశాలలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. బకాయిలు రూ.1,200 కోట్లలో రూ.రూ.600కోట్లు దసరా వరకు, మిగతావి దీపావళి లోగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. తొలి విడతలో రూ.300 కోట్లే విడుదల చేయగా, ఉమ్మడి జిల్లాలోని కళాశాలలకు రూ.250 కోట్లు రావాల్సి ఉందని చెప్పారు. బకాయిలు రాకపోవడంతో కళాశాలల భవనాల అద్దె, అధ్యాపకులు, సిబ్బంది వేతనాలు, విద్యుత్ బిల్లుల చెల్లింపుల్లో ఇబ్బంది ఎదురవుతున్నందున గత్యంతరం లేక బంద్‌కు దిగామని తెలిపారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించేంత వరకు బంద్ కొనసాగుతుందని ప్రైవేట్ వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాల బాధ్యులు ఈ సందర్భంగా ప్రకటించారు.
● ఖమ్మం అర్బన్: రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బొమ్మ ఇంజనీరింగ్ కాలేజీని సైతం బంద్ చేసినట్లు చైర్మన్ బొమ్మ రాజేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని వెల్లడించారు.
● సత్తుపల్లిరూరల్: రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం నుంచి నిరవధిక బంద్ పాటిస్తున్నట్లు సత్తుపల్లిలోని మదర్‌థెరిస్సా విద్యాసంస్థలు, గంగారంలోని సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు తెలిపాయి.
ప్రైవేట్ విద్యాసంస్థల
యాజమాన్యాల స్పష్టీకరణ


