మిర్చి ధరలో కదలిక
● క్వింటాకు రూ.15,675గా నమోదు ● ఇంకాస్త పెరిగితే అమ్మకానికి రైతులు రెడీ
ఖమ్మంవ్యవసాయం: మిర్చి ధరలో కొంత కదలిక కనిపించింది. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన ‘తేజా’ రకం మిర్చిని సోమవారం ఖమ్మం మార్కెట్‌కు పలువురు రైతులు తీసుకురాగా క్వింటాకు రూ.15,675 ధర నమోదైంది. కొద్దిరోజులుగా రూ.15వేల నుంచి రూ.15,400 దాటని ధర కాస్త పెరగడం.. ఈ ఏడాది సీజన్‌తో పోలిస్తే ఇదే ఎక్కువ కావడం గమనార్హం. మార్చి, ఏప్రిల్‌ల్లో రూ.12వేల నుంచి రూ.14వేల మధ్య పలికిన ధర ఆగస్టులో గరిష్టంగా రూ.15,600కు చేరినా తిరిగి రూ.15వేల లోపుకు పడిపోయింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో తేజా రకం మిర్చికి డిమాండ్ పెరుగుతుండడమే ధరలో పురోగతికి కారణమని భావిస్తున్నారు. ఇటీవల ‘మోంథా’ తుపాన్‌తో కురిసిన వర్షాల కారణంగా మిర్చి తోటలు దెబ్బని పూత రాలింది. దీంతో సీజనల్‌లో ఎలా ఉంటుందోనన్న భావనతో వ్యాపారులు ముందుకొస్తుండగా దేశీయంగా మిర్చికి డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు. అయితే, విదేశీ ఆర్డర్లు మాత్రం లేవని కొనుగోదారుల ద్వారా తెలిసింది.
రూ.16 వేల మార్క్ దాటితేనే..
క్వింటా మిర్చి ధర రూ.16 వేల మార్క్ దాటితేనే విక్రయాలు వేగం పుంజుకుంటాయని భావిస్తున్నారు. జిల్లాలోని 48 కోల్డ్ స్టోరేజీల్లో మిర్చి నిల్వలు భారీగా ఉన్నాయి. సీజన్‌లో ధర లేకపోవడంతో అటు రైతులు, ఇటు వ్యాపారులు నిల్వ చేశారు. జూన్ నుంచి అన్ సీజన్ అయినా ధరలో ఆశించిన పురోగతి లేక విక్రయాలు మందకొడిగానే సాగుతున్నాయి. పంట నిల్వతో రైతులపై అదనపు భారం పడుతోంది. అన్ సీజన్‌లో క్వింటా రూ.15 వేల మార్క్ దాటాక 30 శాతం నిల్వ పంటను విక్రయించారు. ఇప్పుడు రూ.16 వేలు దాటితే మిగతా రైతులూ ముందుకొస్తారని, తద్వారా మిర్చి విక్రయాలు జోరందుకుంటాయని వ్యాపారులు చెబుతున్నారు.


