
ఆరు రోజుల తర్వాత మృతదేహం గుర్తింపు
ఖమ్మంఅర్బన్: ఖమ్మం టేకులపల్లి బ్రిడ్జి సమీపాన సాగర్ కాల్వలో ఆరు రోజుల క్రితం స్నానం కోసం వెళ్లి గల్లంతైన వ్యక్తి మృతదేహం మంగళవారం లభ్యమైంది. ఖమ్మం వైఎస్సార్‌నగర్‌కు చెందిన ఎలగందుల వెంకన్న(60) కాల్వ లో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. కొణిజర్ల మండలం రామనర్సయ్యనగర్ సమీపాన కాల్వలో మంగళవారంమాయన మృతదేహాన్ని గుర్తించిన స్థానాకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే మృతదేహం కుళ్లిపోవడంతో అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యాన బయటకు తీసి ఖమ్మం ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్ పోలీసులు తెలిపారు.
600 క్వింటాళ్ల బియ్యం సీజ్
నిర్ధారణ కోసం ల్యాబ్‌కు శాంపిళ్లు
నేలకొండపల్లి: మండలంలోని కొత్తకొత్తూరులో ఓ రైస్ మిల్లులో నిల్వ ఉన్న బియ్యాన్ని సివిల్ సప్లయీస్ అధికారులు సీజ్ చేశారు. రైస్‌మిల్లులో పీడీఎస్ బియ్యం నిల్వ చేశారనే సమాచారంతో జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి చందన్‌కుమార్ ఆధ్వర్యాన మంగళవారం సివిల్ సప్లయీస్, టాస్క్‌ఫోర్స్, పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దాదాపు 600 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేయడంతో పాటు పీడీఎస్ బియ్యమా, కాదా అని నిర్ధారణ కోసం శాంపిళ్లను ల్యాబ్‌కు పంపించారు. ల్యాబ్ నుంచి నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కాగా, భారీగా బియ్యం పట్టుబడడంతో ఎక్కడ సేకరించారు, ఎవరు కొనుగోలు చేశారనే కోణాల్లో ఆరా తీస్తున్నారని తెలిసింది. తనిఖీల్లో డిప్యూటీ తహసీల్దార్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కానిస్టేబుల్‌పై దాడి ఘటనలో ముగ్గురి అరెస్ట్
తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం పోలీస్‌స్టేషన్ వద్ద ప్రేమపెళ్లి విషయమై సోమవారం జరుగుతున్న అడ్డుకోబోయిన హెడ్‌కానిస్టేబుల్ బాలుపై దాడికి పాల్పడిన వారిని గుర్తించారు. రఘునాథపాలెం మండలం వీ.వీ.పాలెంకు చెందిన ఆంగోత్ వివేక్, గుగులోత్ నవీన్, నేలకొండపల్లి మండలం మంగాపురం తండాకు చెందిన భూక్యా శంకర్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సంజీవ్, ఎస్‌ఐ కె.జగదీష్ తెలిపారు.
రుణం పేరుతో నగదు స్వాహాకు యత్నం
రఘునాథపాలెం: రూ.5లక్షల రుణం మంజూరైందని చెబుతూ ఫీజు కింద రూ.49,500 నగదును సైబర్ నేరగాళ్లు స్వాహా చేసేందుకు యత్నించారు. రఘునాథపాలెం మండలం చింతగుర్తికి చెందిన మాలోత్ అశోక్‌కు గత నెల 20న ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు రూ.5 లక్షల రుణం మంజూరైందని నమ్మబలికారు. అయితే, ప్రాసెసింగ్ ఫీజుగా రూ49,400 చెల్లించాలని చెప్పడంతో పాటు ఆన్‌లైన్‌లో పంపించాడు. ఆతర్వాత సదరు వ్యక్తుల ఫోన్ స్విచాఫ్ చేయడంతో మోసపోయినట్లు గ్రహించిన అశోక్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రూ.35 వేల నగదు విత్‌డ్రా చేయకుండా అడ్డుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు.