
నిధుల పక్కదారిపై విచారణ
వైరా: వైరా మున్సిపాలిటీ ఉద్యోగి తన ఖాతాలోకి జనరల్ ఫండ్ నిధులు బదలాయించుకున్న ఘటనపై వరంగల్ రీజినల్ డైరెక్టర్ షాహిద్ మసూద్ విచారణ చేపట్టారు. ఈ విషయమై 10వ తేదీన ‘సాక్షి’లో ‘ఉద్యోగి ఖాతాల్లోకి మున్సిపల్ నిధులు’ శీర్షికన కథనం ప్రచురితం కాగా అధికారులు స్పందించారు. ఈమేరకు వైరా మున్సిపాలిటీకి మంగళవారం వచ్చిన షాహిద్ మసూద్ నాలుగు గంటలకు పైగా రికార్డులు పరిశీలించారు. అకౌంటెంట్ ఏ.వెంకటేశ్వరరావును పిలిపించి కమిషనర్ యు.గురులింగం సమక్షాన విచారణ చేపట్టారు. ఎలాంటి రికార్డులు లేకుండానే 30 చెక్కుల ద్వారా రూ.52 లక్షలకు తన ఖాతాలోకి బదలాయించుకున్నట్లు గుర్తించారు. జనరల్ ఫండ్‌తో పాటుగా 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా పక్కదారి పట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. కనీసం నిబంధనలు పాటించకుండా చెక్కులు రాసినా గత కమిషనర్ వేణు ప్రశ్నించకపోవడం, ఫైళ్ల నిర్వహణ లోపభూయిష్టంగా ఉండడంతో రీజినల్ డైరెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు నిగ్గుతేల్చేలా ఆడిట్ చేయించాలని ఆయన కమిషనర్ గురులింగంను ఆదేశించారు. అంతేకాక నిధుల రికవరీ, క్రిమినల్ చర్యలు తీసుకోవడంపై చర్చించారు.