
సమన్వయంతో పని చేస్తున్నారా?!
సత్తుపల్లి: పాత, కొత్త కాంగ్రెస్ కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నారా.. స్థానిక సంస్థల్లో విజయం వరిస్తుందా.. అంటూ ఏఐసీసీ పరిశీలకుడు మహేంద్రన్ ఆరా తీశారు. జిల్లా అధ్యక్ష పదవి ఎంపికకు చేపడుతున్న అభిప్రాయ సేకరణలో భాగంగా సత్తుపల్లి, కల్లూరుల్లో బుధవారం సమావేశాలు నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ ఆధ్వర్యాన నిర్వహించిన ఈ సమావేశాల్లో మహేంద్రన్ పాల్గొనగా సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాలు, బ్లాక్‌ల వారీగా కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్నారు. జిల్లాలో పార్టీ పనితీరు ఎలా ఉందని ప్రశ్నించగా.. ముగ్గురు మంత్రులు పార్టీని ముందుకు నడిపిస్తున్నారని కార్యకర్తలు బదులిచ్చారు. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులుగా పాత నాయకులనే ఎంపిక చేయడంతో పనితీరు సంతృప్తిగానే ఉందని తెలిపారు.
అవకాశం ఇవ్వండి..
డీసీసీ అధ్యక్ష పదవిని డాక్టర్ మట్టా దయానంద్‌కు అప్పగించాలని పార్టీ శ్రేణులు కోరాయి. సత్తుపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి రాగమయి గెలుపునకు కృషి చేశారని, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దయానంద్‌కు అధ్యక్ష పదవి అప్పగిస్తే పార్టీకి లాభం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇతరులకు అవకాశం కల్పించాలనుకుంటే ఎమ్మెల్యే రాగమయి సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి నూతి సత్యనారాయణ, నాయకులు మట్టా దయానంద్, తుమ్మల యుగంధర్, చక్కిలం రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అభిప్రాయ సేకరణలో ఏఐసీసీ
పరిశీలకుడు మహేంద్రన్