
హద్దులు దాటుతున్న ఇసుక
రోజుకు 50 – 100 లారీలు
అక్కడి ఉచిత ఇసుక పాలసీ ఆధారంగా అక్రమార్జన
అశ్వారావుపేట, సత్తుపల్లి మీదుగా ఖమ్మం, హైదరాబాద్‌కు..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీ ఆధారంగా కొందరు ఇసుకను రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. ఈ తతంగం వెనుక అక్కడి అధికార పార్టీ నేతలున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏపీలో అవసరాల కోసమంటూ ఇసుకను తెలంగాణలోని అశ్వారావుపేట, సత్తుపల్లి మీదుగా ఖమ్మం, హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. అయితే, అక్రమ రవాణాను రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. ఏపీ, తెలంగాణ సరిహద్దులో ఇటీవల పదుల సంఖ్యలో ఇసుక లారీలు (టిప్పర్లు) పట్టుబడడం అక్రవ రవాణాను బయటపెట్టింది.
దర్జాగా సరిహద్దులు దాటించి..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెట్టింది. నిరుపేదల కోసమంటూ ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని అక్కడి అధికార పార్టీ నేతలు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. అక్కడి ఇసుక రీచ్‌లు, స్టాక్ పాయింట్ల నుంచి నిర్మాణాల పేరుతో అనుమతి తీసుకుని టన్నుకు రూ.250 నుంచి రూ.500 వరకు చెల్లిస్తారు. ఆపై అనుమతి తీసుకున్న ప్రాంతానికి కాకుండా విజయవాడ, కొవ్వూరు సమీపం నుంచి తెలంగాణలోని అశ్వారావుపేట, సత్తుపల్లి మీదుగా ఖమ్మం, హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తూ వ్యాపారం కొనసాగిస్తున్నారు.
ప్రణాళికాయుతంగా...
ఇసుక దందాను అక్రమార్కులు తెలివిగా నడిపిస్తున్నారు. ఎక్కడి నుంచి.. ఎప్పుడు .. ఎలా తరలించాలన్న అంశంపై ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమాన ఇసుక తరలించే కొన్ని లారీలకు నంబర్ ప్లేట్లు తొలగిస్తున్నారు. లేకపోతే నేషనల్ హైవే అథారిటీ అవసరాల కోసమంటూ స్టిక్కర్లు వేస్తున్నారు. గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులకు ఇసుక తరలిస్తున్నామని చెబుతూ తెలంగాణలో డంప్ చేస్తున్నారు. కొన్నిసార్లయితే టైల్స్, జిప్సం పౌడర్ అని చెబుతూ లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తరలిస్తున్నారు.
అప్పుడప్పుడు పట్టుబడుతూ..
ఇటీవల అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను పోలీసులు పట్టుకున్నారు. కొన్ని లారీలు కొవ్వూరులో ఇసుకను లోడ్ చేసుకుని ఏలూరుకు వెళ్లాల్సి ఉండగా దారి మళ్లించడంతో తెలంగాణ సరిహద్దు.. ఏపీలోని జీలుగుమిల్లి వద్ద పోలీసులకు చిక్కాయి. ఓ లారీ మార్గమధ్యలో మరమ్మతులకు గురై దాదాపు 12గంటల పాటు ఏపీ భూభాగంలోనే ఉంది. అయినా అక్కడి పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఇదే లారీ తెలంగాణలోకి ప్రవేశించాక పట్టుబడింది.
ఉచిత ఇసుక పథకం ద్వారా అనుమతి తీసుకున్న చోటకు కాకుండా ఇంకో చోటకు తరలిస్తున్నారు. తెలంగాణ సమీపాన ఆంధ్రా సరిహద్దుల వెంట ఇసుక డంప్ చేసి వ్యాపారం చేస్తున్నారు. 50 టన్నులు ఉన్న లారీకి రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు చెల్లిస్తారు. అదే ఇసుకను హైదరాబాద్‌లో టన్నుకు రూ.3వేల నుంచి రూ.3,500 వరకు విక్రయిస్తారు. ఇలా ఒక లారీ బయటకు వస్తే రూ.1.25 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు వస్తుండగా.. ఖర్చులు పోగా లారీకి రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు మిగులుతాయి. ఇలా ప్రతీరోజు 50 నుంచి 100 లారీల ఇసుకను వివిధ మార్గాల్లో హైదరాబాద్ తరలిస్తున్నారనే ఆరోపణలు న్నాయి.
ఏపీ నుంచి తెలంగాణకు లారీల్లో తరలింపు

హద్దులు దాటుతున్న ఇసుక

హద్దులు దాటుతున్న ఇసుక