
సత్తుపల్లి గనుల్లో ఖనిజాలు...
ఏరియా జీఎం షాలేంరాజు
సత్తుపల్లి: సత్తుపల్లిలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో స్కాండియం, స్ట్రాటియం, నియోడియోనియం తదితర ఖనిజాలు ఉన్నట్లు గుర్తించామని కొత్తగూడెం ఏరియా జీఎం షాలెం రాజు వెల్లడించారు. స్థానిక జీఎం కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. ఇక్కడ ఖనిజాల ఆనవాళ్లను గుర్తించగా పరీక్షల కోసం హైదరాబాద్, భువనేశ్వర్‌కు చెందిన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. ఖనిజాల వెలికితీత సాధ్యాసాధ్యాలు పరిశీలించాక వాణిజ్యపరంగా అవసరమని భావిస్తే వెలికితీస్తామన్నారు. కాగా, సత్తుపల్లి కోల్ హ్యాండ్లిగ్ ప్లాంట్, సైలో బంకర్ మరమ్మతు పనులు త్వరలోనే చేపడతామని చెప్పారు. అంతేకాక కాంట్రాక్టర్‌గా వ్యవహరించిన సమంత కంపెనీపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సత్తుపల్లి ఏరియా జీఎం కార్యాలయం ఈ ఏడాది చివరికల్లా ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఇక్కడి ఓపెన్‌కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధనకు కృషి చేస్తున్నామని తెలిపారు. అలాగే, సత్తుపల్లికి సీఎస్‌ఆర్ నిధుల కింద రూ.32 కోట్లు, డీఎంఎస్‌టీ నిధులు రూ.247 కోట్లను సింగరేణి తరఫున కేటాయించామని జీఎం వెల్లడించారు. కాగా, ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి సూచనలతో ఈనెల 26న సత్తుపల్లిలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో పీఓలు ప్రహ్లాద్, నర్సింహారావు, ఎస్‌ఓటీ జీఎం కోటిరెడ్డి, ఎస్టేట్ ఆఫీసర్ శౌర్య పాల్గొన్నారు.