● 72గంటల్లోపే రైతుల ఖాతాల్లోకి నగదు ● వీసీలో మంత్రులు ఉత్తమ్‌కుమార్, తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం సహకారనగర్: గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసేలా అధికార యంత్రాంగం సిద్ధం కావాలని రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలిసి బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. జిల్లా నుంచి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ధాన్యం అమ్మిన రైతుల ఖాతాల్లో 48 నుంచి 72గంటల్లో నగదు జమ అవుతుందనే విషయమై అవగాహన కల్పించాలని చెప్పారు. కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
నాణ్యమైన పంటకు మద్దతు ధర
ఖమ్మంవ్యవసాయం: నాణ్యమైన పంట ఉత్పత్తులకు మద్దతు ధర అందుతుందనే అంశంపై విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. మంత్రుల వీసీ అనంతరం అధికారులతో సమావేశమైన ఆయన అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి వానాకాలం పంటల కనీస మద్దతు ధరల వాల్‌పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రేడ్ ‘ఏ’ రకం వరికి రూ.2,389తో పాటు రూ.500 బోనస్, సాధారణ రకానికి రూ. 2,369, పత్తి తేమశాతం ఆధారంగా గరిష్టంగా రూ.8,110, మొక్కజొన్న రూ.2,400 మద్దతు ధర నిర్ణయించారని చెప్పారు. కేంద్రాల ప్రారంభోత్సవంలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని తెలిపారు. రైతులు కపాస్ కిసాన్ యాప్‌లో పత్తి విక్రయానికి స్లాట్ బుకింగ్ చేసుకునే అంశంపై అవగాహన కల్పించాలని సూచించారు. డీఆర్డీఓ సన్యాసయ్య, డీసీఎస్‌ఓ చందన్‌కుమార్, పౌర సరఫరాల సంస్థ డీఎం శ్రీలత, డీఏఓ డి.పుల్ల య్య, మార్కెటింగ్ అధికారి ఎం.ఏ.అలీం, జిల్లా రవాణా అధికారి వెంకటరమణ, జిల్లా సహకార అధికారి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి
ఖమ్మం అర్బన్: జిల్లాలో కొత్త రోడ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచడమే కాక అవసరమైన చోట మరమ్మతులు చేయించాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. కలెక్టరేట్‌లో కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారుల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. వర్షాలతో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. జిల్లా ప్రవేశం వద్ద నలువైపులా బోర్డులు ఏర్పాటు చేసి మొక్కలు నాటాలని తెలిపారు. అలాగే, బైపాస్ బ్రిడ్జి వెడల్పునకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ఆర్ అండ్ బీ, విద్యుత్ ఎస్‌ఈలు యాకూబ్, శ్రీనివాసాచారి, నేషనల్ హైవే పీడీ రామాంజనేయరెడ్డి, ఈఈలు పవార్, తానేశ్వర్, యుగంధర్ దితరులు పాల్గొన్నారు.