
ఫలితాలపై ‘ప్రత్యేక’ దృష్టి
పదో తరగతి విద్యార్థులకు
స్పెషల్ క్లాసులు
ఉదయం, సాయంత్రం గంట
చొప్పున నిర్వహణ
జిల్లాలో 212 ప్రభుత్వ పాఠశాలలు.. 6,500 మంది విద్యార్థులు
సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు
చదువుకునేందుకు అవకాశం
స్లిప్ టెస్ట్‌లకు సమయం దొరుకుతోంది
ఖమ్మంసహకారనగర్: విద్యాశాఖపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో పదో తరగతి విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు చర్యలు చేపడుతూనే.. ప్రత్యేక తరగతులు కూడా నిర్వహిస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో నాలుగు రోజుల నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న వార్షిక పరీక్షలకు ఇప్పటి నుంచే విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. సకాలంలో సిలబస్ పూర్తి చేసి, ఆ వెంటనే రివిజన్ ప్రారంభించాలని, తద్వారా ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోని 212 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 6,500 విద్యార్థులు మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు.
ప్రత్యేక తరగతులిలా..
జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఉదయం 7.45 నుంచి 8.45 గంటల వరకు, సాయంత్రం 4.15 నుంచి 5.15 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సమయాల్లో విద్యార్థులను చదివించడంతో పాటు వారికి గల సందేహాలను ఉపాధ్యాయులు నివృత్తి చేస్తున్నారు. తద్వారా ప్రతీ సబ్జెక్టుపైనా పిల్లలకు పట్టు పెరుగుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
పాఠశాలలో ప్రతీ రోజు ఉద యం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో మాకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకుంటున్నాం.పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయు లు మా వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్నారు. ప్రత్యేక తరగతుల్లో శ్రద్ధగా చదువుకొని మంచి ఫలితాలు సాధిస్తాం.– యశస్విని, మడుపల్లి, మధిర మండలం
ప్రత్యేక తరగతుల ద్వారా ఎక్కువగా చదువుకునే అవకాశం కలుగుతోంది. ఈసారి స్పెషల్ క్లాసులు కొంత ముందుగానే ప్రారంభించారు. ప్రత్యేక తరగతుల ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది.
–కె.విఘ్నేశ్, మడుపల్లి, మధిర మండలం
ఉదయం, సాయంత్రం సమయాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండడంతో రివిజన్‌కు చాలా సమయం దొరుకుతుంది. తరగతి గదిలో వచ్చిన సందేహాలు ప్రత్యేక తరగతుల్లో నివృత్తి చేసుకుంటున్నాం. చిన్న చిన్న మాక్ టెస్టులు, స్లిప్పు టెస్టులకు కూడా టైం దొరుకుతోంది. – ఎం.నాగేశ్వరి,
జల్లేపల్లి, తిరుమలాయపాలెం మండలం

ఫలితాలపై ‘ప్రత్యేక’ దృష్టి

ఫలితాలపై ‘ప్రత్యేక’ దృష్టి

ఫలితాలపై ‘ప్రత్యేక’ దృష్టి