యువతకు ఉపాధి కల్పించేలా కోర్సులు
ఏటీసీ ప్రారంభోత్సవంలో
రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం సహకారనగర్: అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా విద్యార్థులకు ఉపాధి కల్పించేలా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం టేకులపల్లిలోని ఐటీఐ ప్రాంగణంలో నిర్మించిన ఏటీసీని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్‌దత్‌తో కలిసి మంత్రి సోమవారం ప్రారంభించి మాట్లాడారు. ఐటీఐల్లోని సంప్రదాయ కోర్సులతో ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నందున నైపుణ్య కోర్సులను రూపొందించి బోధనకు ఏటీసీలు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. రానున్న 5 – 10 ఏళ్లలో జరిగే మార్పులు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏటీసీలో కోర్సుల బోధన ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలోని ఏటీసీల్లో కోర్సులు పూర్తి చేసే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రముఖ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం, మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెంల్లో నాలుగు ఏటీసీలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.
రోబోటిక్స్ బోధన కూడా..
ఖమ్మం ఏటీసీలో రోబోటిక్స్‌తో పాటు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, మరమ్మతులపై శిక్షణ కోర్సులు ఉన్నాయని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. పరిశ్రమల డిమాండ్‌కు అనుగుణంగా కోర్సులను ప్రభుత్వం డిజైన్ చేయించిందని చెప్పారు. ఇక్కడ రోబోటిక్స్ కోర్సు పూర్తిచేసే విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పోలీసు కమిషనర్ సునీల్‌దత్ మాట్లాడుతూ విద్యార్థులు చేసే కోర్సులు – పరిశ్రమల్లో అవసరాలకు తేడా ఉన్నందున ప్రభుత్వం ఏటీసీలను అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఏటీసీ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, విద్యుత్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈలు శ్రీనివాసాచారి, యాకోబు, ఆర్‌డీఓ నర్సింహారావు, కార్మిక శాఖ సహాయ కమిషనర్ కృష్ణవేణి, కార్పొరేటర్ సత్యనారాయణ, తహసీల్దార్ సైదులు పాల్గొన్నారు.
టీటీడీ ఆలయ నిర్మాణంపై సమీక్ష
ఖమ్మంఅర్బన్: ఖమ్మంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యాన నిర్మించే వేంకటేశ్వర స్వామి ఆలయానికి కావాల్సిన స్థలంపై రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ అనుదీప్, ఆర్‌డీఓ జి.నరసింహారావు, తహసీల్దార్ డి.సైదులుతో సమావేశమైన ఆయన ఆలయ నిర్మాణానికి అనువుగా, ఎలాంటి వివాదాలు లేని స్థలాన్ని ఎంపిక చేసి టీటీడీ బృందానికి నివేదిక ఇవ్వాలని తెలిపారు. ఈక్రమాన రవాణా సౌకర్యాలను పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మేయర్ పి.నీరజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, పీఏసీఎస్ అధ్యక్షుడు రావూరి సైదబాబు తదితరులు పాల్గొన్నారు.