
కలప విలువ రూ.3కోట్లకు పైగానే..
● సండ్ర కలప రవాణాపై కొనసాగుతున్న విచారణ ● పాత్రధారులు, వారి వాటాలపై అధికారుల ఆరా
ఖమ్మంవ్యవసాయం: ఉత్తరాది రాష్ట్రాలకు విలువైన కలపను అక్రమంగా తరలించిన వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది. నేషనల్ ట్రాన్సిట్ పర్మిట్ సిస్టం(ఎన్‌టీపీఎస్) ద్వారా తప్పుడు వివరాలతో పర్మిట్లు తీసుకుని సాధారణ కలప స్థానంలో రూ.కోట్ల విలువైన సండ్ర కలపను మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణా, అరుణాచల్‌ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోని పాన్ మసాలా తయారీ ఫ్యాక్టరీలకు తరలించారు. అయితే, మహబూబాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ కలపను సేకరించినా చింతకాని మండలం నుంచి తుమ్మ కలప తరలిస్తున్నట్లు పర్మిట్లు తీసుకున్నారు. ఈ అక్రమాలను మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అక్కడి అటవీ అధికారులు గుర్తించడంతో కొద్ది రోజులుగా విచారణ జరుగుతోంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రేంజ్ పరిధిలోని మన్నెగూడెం, తోడేళ్లగూడెం, సీరోలు, కురవి ప్రాంతాల అసైన్డ్ భూముల నుంచి సండ్ర కలపను నరికి, చింతకాని సెక్షన్ నుంచి 24 లారీల కలపకు పర్మిట్లు తీసుకోవడం విశేషం. ఒక్కో లారీ సండ్ర కలప విలువ రూ. 15 లక్షల వరకు ఉండగా, మొత్తం రూ.3.60 కోట్ల విలువైన కలప అక్రమంగా తరలించినట్లు తేల్చారు. దీంతో పాటు తరలింపునకు సిద్దం చేసిన మరో మూడు లారీల సండ్ర కలపను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
ఎవరి వాటా ఎంత?
విలువైన సండ్ర కలప రవాణాలో పాలుపంచుకున్న వారిని ఫోన్‌కాల్ డేటా ఆధారంగా అధికారులు ఇప్పటికే గుర్తించారు. ప్రధాని సూత్రధారితో పాటు ఆయనకు సహకరించిన అటవీ శాఖ ఉద్యోగులు, మధ్యవర్తులను ఇప్పటికే విచారించి వారి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సూత్రధారి, మధ్యవర్తులు ఎవరిరెవరితో మాట్లాడారో నిగ్గు తేల్చే క్రమాన అటవీ ఉద్యోగుల పాత్ర బయటపడింది. ఈక్రమంలోనే ప్రధాన సూత్రధారితో అధికారులకు ఒప్పందాలు, మధ్యవర్తి అకౌంట్ ద్వారా నగదు లావాదేవీలు వెలుగు చూసినట్లు సమాచారం. అక్రమాల వెనుక ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని కొందరు అటవీ ఉద్యోగులు ఉండగా, ఇప్పటికే ముగ్గురిని సస్పెండ్ చేశారు. ఒకటి, రెండు రోజుల్లో మహబూబాబాద్ అటవీ శాఖలో ఇంకొందరు ఉద్యోగులపై వేటు పడే అవకాశముందని సమాచారం.