
బదిలీల్లో రాజకీయ ఒత్తిళ్లు?
● వైరాలో మొన్న కమిషనర్, నేడు సీఐ ● నిలిచిపోయిన సీఐ బదిలీ
వైరా: వైరా నియోజకవర్గంలో పలువురు అఽధికారుల బదిలీలు అర్ధంతరంగా ఆగిపోతున్నాయి. తొలుత ఉత్తర్వులు వెలువడడం, కొత్త అధికారి బాధ్యతల స్వీకరణకు వచ్చేలోగా ఆ ఉత్తర్వులు ఆగిపోయాయని చెప్పడం సర్వసాధారణంగా మారింది. ఇందుకు రాజకీయ పార్టీల నేతల నుంచి ఉన్నతాధికారులపై వస్తున్న ఒత్తిడే కారణమని తెలుస్తోంది.
ఆగస్టులో కమిషనర్
గత ఆగస్టులో వైరా మున్సిపల్ కమిషనర్ చింతా వేణును బదిలీ చేయడమే కాక ఆయన స్థానంలో నల్లగొండ జిల్లా నుంచి యు.గురులింగంను కేటాయించారు. దీంతో గురులింగం బాధ్యతలు స్వీకరించడానికి కార్యాలయానికి రాగా, ఆయన బదిలీ నిలిపేశారని తెలియడంతో వెనక్కి వెళ్లారు. ఆతర్వాత ఏం జరిగిందో ఏమో కానీ మళ్లీ గురులింగంనే కేటాయించగా ఆయన విధుల్లో చేరారు. ఇక తాజాగా శనివారం వైరా సీఐ నూనావత్ సాగర్ బదిలీ అయినట్లు ఉత్తర్వులు అందాయి. ఆయనను ఐజీ కార్యాలయానికి అటాచ్ చేయడమే కాక ఐజీ కార్యాలయంలో ఉన్న వినయ్‌కుమార్ వైరాకు కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈమేరకు సోమవారం వినయ్‌కుమార్ వైరా చేరుకోవడంతో సాగర్ బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే వినయ్‌కుమార్‌ను వెనక్కి వచ్చేయాలని సూచించడంతో పాటు వైరా సీఐగా సాగరే కొనసాగుతారని మౌఖిక ఆదేశాలు రావడం గమనార్హం. రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి పెరగడం, పలా నా అధికారే కావాలని నేతలు పట్టుబడుతుండడంతోనే బదిలీల్లో మార్పులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా వైరా ఏసీపీగా తమకు అనుకూలమైన అధికారికి పోస్టింగ్ ఇప్పించుకోవాలని కొందరు నేతలు ప్రయత్నిస్తుండడంతోనే ఇంకా ఎవరినీ నియమించడం లేదని సమాచారం.