
దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి
ఖమ్మం సహకారనగర్: ప్రజావాణిలో అందే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి అర్హతల మేర పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో ఆయన దరఖాస్తులు, వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమైన కలెక్టర్ దరఖాస్తులను పరిష్కరించాలని సూచించడమే కాక ఏవైనా తిరస్కరిస్తే అందుకు కారణాలు తెలియచేయాలని చెప్పారు.
●ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా సమీకృత గురుకుల విద్యాలయాలకు భవన నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లతో కలిసి అధికారులతో సమీక్షించిన ఆయన మాట్లాడారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రూ.200 కోట్ల వ్యయంతో 20 – 25 ఎకరాల్లో పాఠశాలలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కాగా, జూనియర్ కళాశాలల మరమ్మతులకు మంజూరైన రూ.2.90 కోట్ల నిధులతో అన్ని వసతులు కల్పించాలని చెప్పారు. ప్రతీ అధికారి వారానికి రెండేసి గురుకులాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని తెలిపారు.
●జిల్లాలో ధాన్యం, పత్తి కొనుగోళ్లు సజావుగా సాగేలా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. కొనుగోళ్లకు ఏర్పాట్లపై చర్చించిన ఆయన కేంద్రాల్లో వసతుల కల్పన, గన్నీ బ్యాగుల లభ్యతపై సూచనలు చేశారు. కాగా, కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ అనుదీప్ తనిఖీ చేసి భద్రతపై సమీక్షించారు.
●కలెక్టరేట్‌లోని అన్ని శాఖల ఉద్యోగులు విధులు సమర్థవంతంగా నిర్వర్తిస్తూ రోజుకు రెండుసార్లు హాజరు వేయాలని కలెక్టర్ అనుదీప్ స్పష్టం చేశారు. ఇందిరా డెయిరీ పథకం, జాతీయ రహదారులకు భూసేకరణ, ఉద్యోగుల హాజరుపై సమీక్షించిన ఆయన ఎవరైనా రెండు సార్లు హాజరు నమోదు చేయపోపోతే చర్యలు తప్పవని తెలిపారు.
●ఖమ్మంవైద్యవిభాగం: అత్యవసర సమయాల్లో ఉపయోగపడే సీపీఆర్‌పై ప్రతిఒక్కరు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్ ఉద్యోగులకు వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఆకస్మికంగా వచ్చే గుండెపోటు నుంచి బాధితులను రక్షించేందుకు సీపీఆర్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సమావేశాల్లో డీఆర్‌ఓ ఏ.పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్‌డీఓ సన్యాసయ్య, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రీనివాసాచారి, డీఐఈఓ రవిబాబు, పౌరసరఫరాల సంస్థ డీఎం శ్రీలత, జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం.ఏ.అలీం, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి శ్రీనివాసరావు, డీఎంహెచ్‌ఓ కళావతి బాయి, డీసీహెచ్‌ఎస్ రాజశేఖర్, విద్యాశాఖ ఈఈ బుగ్గయ్య, ఉద్యోగులు చందూనాయక్, శ్రీనివాసరావు, ఎం.ఏ.రాజు, అన్సారీ పాల్గొన్నారు.
‘ప్రజావాణి’లో కలెక్టర్ అనుదీప్