
హద్దులు దాటిన దందా
రాష్ట్రమంతా వివరాలు ఆరా
● అటవీ శాఖ పర్మిట్‌లో లొసుగులతో స్మగ్లర్ల బరితెగింపు ● అనుమతి ఉన్న కలప మాటున విలువైన కలప తరలింపు ● సైబర్ క్రైంగా గుర్తించి విచారణ చేపట్టిన అటవీ శాఖ ● అటవీ శాఖ ఉద్యోగుల ప్రమేయంపైనా ఆరా
ఖమ్మంవ్యవసాయం: అటవీ శాఖ కళ్లు కప్పి యథేచ్ఛగా పొరుగు రాష్ట్రాలకు కొందరు కలపను అక్రమంగా రవాణా చేస్తున్నారు. కలప రవాణాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ‘నేషనల్ ట్రాన్సిట్ పర్మిట్(ఎన్‌టీపీసీ)’ నిబంధనల్లో లొసుగుల ఆధారంగా దందాకు పాల్పడుతున్నట్లు బయపడింది. ఎన్టీపీసీ విధానంలో 44జాతుల కలపను అన్ని అనుమతులు, తగిన ఆధారాలతో రవాణా చేసే అవకాశం ఉంది. ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, కలప వివరాలు, ఏ ప్రాంతానికి చెందినది, ఏయే సర్వేనంబర్లలో చెట్లు నరికారు తదితర వివరాలు పొందుపర్చాలి. అయితే, కొన్ని లొసుగులను కలప స్మగ్లర్లు తమకు అనుకూలంగా మార్చుకుని అనుమతి ఉన్న కలప మాటున విలువైన కలపను ఉత్తరాది రాష్ట్రాలకు స్మగ్లింగ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం అటవీ ప్రాంతం నుంచి అనుమతి ఉన్న కలప పేరిట తరలిస్తున్నట్లు వాహనాన్ని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అటవీ అధికారులు తనిఖీ చేయగా విలువైన సండ్ర కర్ర బయటపడింది. దీంతో అక్కడి అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా రాష్ట్ర అటవీ శాఖ కలప విచారణ మొదలుపెట్టింది.
24 పర్మిట్లు.. వందలాది టన్నులు
నేషనల్ పర్మిట్ విధానాన్ని అడ్డం పెట్టుకుని సర్కారు తుమ్మ వంటి కలపను రవాణా చేస్తున్నట్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని అక్రమార్కులు అనుమతి పొందారు. ఆపై సండ్రతో పాటు ఇతర విలువైన జాతుల కలపను మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఖమ్మం జిల్లా నుంచి కొందరు వ్యాపారులు 24 పర్మిట్లతో వందలాది మెట్రిక్ టన్నుల కలపను రవాణా చేసినట్లు మధ్యప్రదేశ్ అటవీ అధికారులు గుర్తించారు. వీటితో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి స్మగ్లింగ్ ముఠా ఉత్తరాది రాష్ట్రాలకు రవాణా చేసినట్లు సమాచారం.
సైబర్ క్రైంగా గుర్తింపు
కొందరు అక్రమార్కులు అనుమతి లేని కలపను రవాణా చేసిన వ్యవహారాన్ని అటవీ శాఖ సైబర్ క్రైంగా గుర్తించింది. ఆన్‌లైన్ దరఖాస్తులో వివరాలు తప్పుగా నమోదు చేయడం, అడవి లేని ప్రాంతాలను అటవీ ప్రాంతాలుగా చూపడం, లేని కలపను ఉన్నట్లు సృష్టించడంతో సైబర్ క్రైంగా నిర్ధారించినట్లు తెలిసింది. దీంతో పాటు నిర్దేశించిన కలప మాటున అనుమతి లేని, విలువైన కలప జాతులను రవాణా చేయడాన్ని నేరంగా గుర్తించి ఆయా అంశాలపై విచారణ చేపట్టింది. కాగా, కలప రవాణాకు స్థానిక లారీలు కాకుండా రాజస్థాన్, మహారాష్ట్ర లారీలను వినియోగించినట్లు గుర్తించారు. ఈమేరకు మార్గమధ్యలోని చెక్‌పోస్టుల వద్ద వివరాలు సేకరిస్తున్నారు.
ఉద్యోగుల పాత్ర ఉందా?
కలప అక్రమ తరలింపు వ్యవహారంలో అటవీ శాఖ అధికారులు, ఉద్యోగుల ప్రేమేయం ఉందా అన్న అంశంపైనా ఉన్నతాధికారులు దృష్టి సారించారు. కలప రవాణా వాహనాలను అటవీ అధికారులు, టాస్క్‌ఫోర్స్ బృందాలతో పాటు చెక్‌పోస్టుల సిబ్బంది తనిఖీ చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ జిల్లా, రాష్ట్రం దాటి లారీలో వెళ్లడంతో సిబ్బంది ప్రమేయం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈమేరకు ఆయా ప్రాంతాల్లోని ఉద్యోగుల వివరాలు సేకరించి విచారణ చేపడుతున్నారు. కాగా, ఖమ్మం జిల్లాలో అటవీ ప్రాంతం తక్కువగానే ఉండగా పొరుగన ఉన్న భద్రాద్రి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో విస్తారంగా ఉన్న అటవీ ప్రాంతం నుంచి విలువైన కలపను దొంగచాటుగా రవాణా చేస్తున్న అంశంపై బయటపడడం చర్చనీయాంశంగా మారింది.
నేషనల్ ట్రాన్సిట్ పర్మిట్ విధానాన్ని అడ్డుపెట్టుకొని అక్రమ కలప రవాణాపై రాష్ట్ర వ్యాప్తంగా అటవీ శాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే బయటపడిన అక్రమాలపై విచారణ చేపడుతున్నాం. ప్రస్తుతం సేకరించిన ఆధారాల మేరకు ఇంకా ఏయే ప్రాంతాల నుంచి, ఎంత మేర కలప అక్రమ రవాణా జరిగిందనే అంశాన్ని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. ఇదేసమయాన ఉద్యోగుల పాత్రపైనా విచారణ చేస్తున్నాం.
– సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, జిల్లా అటవీ అధికారి

హద్దులు దాటిన దందా