
●శ్రీరామలీలా మహోత్సవ్
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గురువారం విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. రామదాసు కాలం నుంచి ఆలయం తరఫున రామ్‌లీలా ఉత్సవంగా జరపడం ఆనవాయితీ కాగా, ఈ వేడుకలకు దసరా మండపం వేదిక కానుంది. ఈ సందర్భంగా గురువారం శ్రీ సీతాలక్ష్మణ సమేత రామచంద్రస్వామిని పల్లకీ సేవగా దసరా మండపంలో కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం జమ్మి చెట్టు వద్ద శమీ, ఆయుధ పూజలు చేస్తారు. రావణాసుర వధగా జరిపే శ్రీ రామలీలా మహోత్సవానికి ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వేడుక నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు.