
●వేడుక చూడాలంటే పెద్దమ్మగుడికి వెళ్లాల్సిందే..
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని పెద్దమ్మతల్లి ఆలయం దసరా వేడుకలకు ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇక్కడ నిర్వహించే దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతాయి. చివరి రోజున దసరాను పురస్కరించుకుని శమీ పూజ కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. ఈ పూజలు వీక్షించడానికి తెలంగాణతో పాటు ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, గతేడాది ఉత్సవాల నిర్వహణకు రూ.10 లక్షల మేర వెచ్చించగా, ఈ సారి కూడా అంతే మొత్తంలో ఖర్చు చేయనున్నట్లు తెలిసింది. నవరాత్రి మహోత్సవాల చివరి రోజైన గురువారం.. పెద్దమ్మతల్లి ఆలయం ఎదుట గల జమ్మి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. ఇందుకోసం విద్యుద్దీపాలతో అలంకరించడంతో పాటు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈఓ రజినీకుమారి వెల్లడించారు.