
ఆలయానికి వెళ్తూ అనంత లోకాలకు..
ఖమ్మంఅర్బన్: పిల్లలతో కలిసి ఆలయానికి వెళ్తున్న మహిళ మార్గమధ్యలోనే రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడింది. ఖమ్మం మమత రోడ్డులో బుధవారం జరిగిన ఈ ప్రమాదంలో వివరాలు... మమత రోడ్డు ప్రాంతానికి చెందిన అనమోలు లోకేశ్వరి(34), తన పిల్లలైన అస్మిత, విరాట్‌తో కలిసి స్కూటీపై గుడికి బయలుదేరింది. మధ్యలో వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనగా స్కూటీ నడుపుతున్న లోకేశ్వరి తీవ్ర గాయాలతో పడిపోయింది. పిల్లలకు కూడా గాయాలు కాగా స్థానికులు వారిని మమత ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లోకేశ్వరి మృతి చెందింది. ఈమేరకు ఘటనపై కేసు నమోదుచేసినట్లు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్ తెలిపారు.
వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి..
ఖమ్మంరూరల్: మండలంలోని సత్యనారాయణపురం సమీపాన ఖమ్మం – వరంగల్ ప్రధాన రహదారిపై వాహనం ఢీకొనగా గుర్తుతెలియని వృద్ధుడు(60) బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. సదరు వృద్ధుడు రోడ్డు వెంట నడిచి వెళ్తుండగా వాహనం ఢీకొట్టడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయన ఎరుపు రంగు టీ షర్ట్, గీతల లుంగీ ధరించి ఉన్నాడని సీఐ ముష్క రాజు తెలిపారు. మృతదేహాన్ని అన్నం పౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావుసహకారంతో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
రోడ్డుప్రమాదంలో వ్యక్తి ..
కారేపల్లి: ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఘటనకు సంబంధించి వివరాలు... మండలంలోని పేరుపల్లికి చెందిన సిరికొండ కృష్ణ(40) మోపెడ్‌పై బుధవారం కారేపల్లి నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా రావోజీతండా వద్ద మూలమలుపు సమీపాన పేరుపల్లి నుంచి కారేపల్లి వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కృష్ణ కాలు విరిగి ఓ ఎముక కారు ముందు భాగంలో ఇరుక్కుపోయింది. అంతేకాక తలకు తీవ్ర గాయాలు కావడంతో కృష్ణను ఖమ్మం ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందాడు. ఘటనా స్థలంలో కారేపల్లి ఎస్‌ఐ ఎస్.నవిత పరిశీలించారు. మృతుడికి భార్య ఉమ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి