
‘రెవెన్యూ’లో ఉలికిపాటు..
వెలవెలబోయిన తహసీల్
● ఏసీబీ దాడులతో కలకలం ● ఇంకా ‘జలగ’లు ఉన్నాయని ఆరోపణలు
సత్తుపల్లి: జిల్లాలోని తల్లాడ తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) బుధవారం చేసిన తనిఖీలతో రెవెన్యూ శాఖలో కలకలం మొదలైంది. తల్లాడ తహసీల్దార్ వి.సురేష్‌కుమార్, ఆర్‌ఐ మాలోతు భాస్కర్‌నాయక్, కంప్యూటర్ ఆపరేటర్ బి.శివాజీరాథోడ్ రూ.10వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. పని చేయకుండా కొర్రీలు పెట్టడం, డబ్బుల కోసం వేధిస్తుండడంతో ఓ రైతు ఏసీబీని ఆశ్రయించగా రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. గతంలోనూ తల్లాడలోనే తహసీల్దార్ పట్టుబడడం గమనార్హం. అయితే, రెవెన్యూ శాఖలో ఇంకా పలువురు అక్రమార్కులు ఉన్నందున ఏసీబీ అధికారులు దృష్టి సారించాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.
అయినా భయం లేదు...
సత్తుపల్లి నియోజకవర్గంలో ఏసీబీ దాడులు జరుగుతున్నా.. కొందరు ప్రభుత్వ ఉద్యోగుల తీరు మారకపోవటం చర్చానీయాంశంగా మారింది. 1989లో అప్పటి తల్లాడ తహసీల్దార్ ఏసీబీకి చిక్కారు. 2019 ఫిబ్రవరి 26న తల్లాడ మండలం కలకొడిమ వీఆర్‌ఓ శ్రీనివాసరావు, అదే ఏడాది మార్చి 27న సత్తుపల్లి మండలం గంగారం వీఆర్వో పద్దం వెంగళరావు, జులై 16న దమ్మపేట నీటిపారుదల శాఖ ఏఈఈ పంది నర్సింహారావు, ఈ ఏడాది జనవరి 27న మున్సిపల్ వార్డు ఆఫీసర్ వినోద్‌ను ఏసీబీ రెడ్‌హ్యాండెట్‌గా పట్టుకుంది. అలాగే, 2019లో జులై 26, 27వ తేదీల్లో వేంసూరు తహసీల్‌లో ఏసీబీ అధికారులు తనిఖీ చేపట్టారు.
ఎకరాకు రూ.10వేల నుంచి..
రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతిపై వరుస ఆరోపణలు వస్తుండడం, ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్నా తీరు మారడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఏ సర్టిఫికెట్‌కై నా ముక్కుపిండి డబ్బు వసూళ్లు చేస్తున్నారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్లే కీలకంగా వ్యవహరిస్తున్నారని, రిజిస్ట్రేషన్లకు వచ్చిన రైతుల నుంచి ఎకరాకు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు లంచం డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎవరైనా డబ్బు ఇవ్వకపోతే సాంకేతిక సమస్యల పేరిట పెండింగ్ పెట్టడం ఆనవాయితీగా మారిందని తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ భూమి ప్రొబిటెడ్ జాబితాలో పడగా, ఆన్‌లైన్‌లో దరఖాస్తు రైతుకు సంబంధించి పత్రాలను ఓ అధికారి కలెక్టరేట్‌కు సమర్పించకపోవడంతో లావాదేవీలు నిలిచిపోయాయని సమాచారం. ఈ విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
మంత్రి పొంగులేటి మందలించినా..
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూలై నెల 17న పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల పంచాయతీ భవనం ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ఇద్దరు గిర్దావర్ల తీరుతో ఫిర్యాదు చేయడంతో తక్షణమే వారిని బదిలీ చేయాలని ఆదేశించారు. ఇక జులై 25న జిల్లాలోని 27 మంది డిప్యూటీ తహసీల్దార్లు, గిర్దావర్లను బదిలీ చేస్తే సత్తుపల్లి నియోజకవర్గం నుంచే ఐదుగురు ఉండడం చర్చకు దారితీసింది.
తల్లాడ: తల్లాడ తహసీల్దార్ సహా ముగ్గురు ఒకేరోజు ఏసీబీకి పట్టుబడడంతో గురువారం కార్యాలయం వెలవెలబోయింది. తహసీల్దార్ సురేష్‌కుమార్, ఆర్‌ఐ భాస్కర్‌నాయక్, భూ భారతి ఆపరేటర్ శివాజీ రాథోడ్ బుధవారం ఏసీబీకి పట్టుబడిన విషయం విదితమే, ఈ స్థానాల్లో ఎవరినీ నియమించకపోవడంతో కార్యాలయంలో లావాదేవీలేవీ జరగలేదు. గత ఏడాది కాలంగా తల్లాడలో డిప్యూటీ తహసీల్దార్, రెండో ఆర్‌ఐ కూడా లేరు. ఇప్పుడు ముగ్గురు ఏసీబీకి పట్టుబడడంతో భూభారతి రిజిస్ట్రేషన్లు నిలిచిపోగా, ఇతర కార్యకలాపాలు కూడా కొనసాగలేదు.