రూ.25లక్షల పోస్టల్‌ బీమా చెక్కు | - | Sakshi
Sakshi News home page

రూ.25లక్షల పోస్టల్‌ బీమా చెక్కు

Sep 19 2025 2:13 AM | Updated on Sep 19 2025 2:13 AM

రూ.25లక్షల  పోస్టల్‌ బీమా చెక్కు

రూ.25లక్షల పోస్టల్‌ బీమా చెక్కు

వేంసూరు: మండలంలోని అడసర్లపాడుకు చెందిన తాటికొండ పాండురంగాచారి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆయన కుటుంబానికి పోస్టల్‌ బీమా ద్వారా మంజూరైన రూ.25లక్షల చెక్కను ఖమ్మం పోస్టల్‌ సూపరింటెండెంట్‌ వీరభద్రస్వామి గురువారం అందజేశారు. గత ఏడాది పాండురంగాచారి రూ.549, రూ.749 ప్రీమియంతో రెండు బీమా పాలసీలు చేశారని ఆయన తెలిపారు. తక్కువ ప్రీమియంతో బీమా పథకాలు ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఐపీపీబీ మేనేజర్‌ రాజేష్‌, సత్తుపల్లి పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.రాజేష్‌, ఎంఓ రాజాతోపాటు రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచండి

ముదిగొండ: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణాల్లో వేగం పెంచాలని జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత సూచించారు. మండలంలోని గోకినేపల్లిలో గురువారం ఆమె ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. యంత్రాంగం తరఫున సహకరిస్తుండడమే కాక బిల్లులు దశల వారీగా అందుతున్నందున ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తిచేసుకోవాలని తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపీఓ వాల్మికీ కిషోర్‌, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.

ఐదు ఇసుక ట్రాక్టర్లు సీజ్‌

ముదిగొండ: మండలంలోని పెద్దమండవ, గంధసిరి మున్నేరు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను పోలీసులు గురువారం సీజ్‌ చేశారు. సీఐ ఓ.మురళి ఆధ్వర్యాన తనిఖీలు చేపట్టగా పెద్దమండవ మున్నేరు నుంచి అనుమతి లేకుండా తరలిస్తున్న మూడు, గంధసిరి నుంచి ఇసుక తీసుకెళ్తున్న రెండు ట్రాక్టర్లు పట్టుబడ్డాయి. ఈమేరకు వాహనాలను సీజ్‌ చేసి డ్రైవర్లు, యజమానులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

పేకాటరాయుళ్ల అరెస్టు

తిరుమలాయపాలెం: మండలంలోని గోల్‌తండా పరిధి ఓ వెంచర్‌లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో గురువారం టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐ సురేష్‌ ఆధ్వర్యాన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నలుగురిని అదుపులోకి తీసుకుని రూ.6,900 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులున స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించగా కేసు నమోదు చేశారు.

కారు, ద్విచక్ర వాహనం ఢీ : ముగ్గురికి గాయాలు

ఖమ్మంఅర్బన్‌: ఖమ్మం – వైరా రోడ్డులో వెలుగుమట్ల పార్క్‌ సమీపాన గురువారం కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో బైక్‌పై వెళ్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. పార్కు రోడ్డులో నుంచి వస్తున్న ద్విచక్రవాహనాన్ని వైరా వైపు నుండి ఖమ్మం వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఆపై రోడ్డు వెంట ఉన్న కేఎంసీ బోర్డును కూడా ఢీకొట్టగా ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. అయితే, క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించగా వారి వివరాలు తెలియాల్సి ఉందని ఖమ్మం అర్బన్‌ సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement