
నిరంతర కృషితోనే మెరుగైన ఫలితాలు
ఖమ్మంమయూరిసెంటర్: విద్యార్థులు నిరంతరం శ్రద్ధగా చదువుతూ భవిష్యత్ లక్ష్యాలపై దృష్టి సారిస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఖమ్మం రాపర్తినగర్‌లోని టీజీఎంఆర్‌జేసీ బాలికల పాఠశాలలో ఏర్పాటుచేసిన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. కాలేజీలో లైబ్రరీ, పాఠ్యపుస్తకాలు, తరగతి గదులను పరిశీలించాక విద్యార్థినుల తల్లిదండ్రులకు ఇక్కడి సౌకర్యాలను వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ కీలక దశ అయినందున శ్రద్ధగా చదవాలని తెలిపారు. ఇంటర్‌లో రాణించడంతోనే తనకు బిట్స్ పిలానీలో సీటు వచ్చిందని, ఆతర్వాత సివిల్స్ రాశానని చెప్పారు. డిగ్రీతో పాటు ప్రొఫెషనల్ కోర్సుల్లో సీటు రావడానికి ఇంటర్‌లో అడుగులు పడతాయని తెలిపారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ద్వారా నీట్, జేఈఈ పోటీ పరీక్షలకు శిక్షణ ఇప్పించనున్నందున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విజయానికి దగ్గరి దారులు ఉండవనే విషయాన్ని గుర్తించి కష్టాన్నే నమ్ముకోవాలని కలెక్టర్ తెలిపారు.జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ముజాహిద్, ఆర్‌ఎల్‌సీ అరుణకుమారి, ప్రిన్సిపాల్ చుండు అఖిల, అధ్యాపకులు పాల్గొన్నారు.
సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ప్రారంభించిన
కలెక్టర్ అనుదీప్