
బీసీ రిజర్వేషన్లు అమల్లోకి రాగానే ఎన్నికలు
వైరా: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తూ బిల్లు అమలుకాగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. వైరాకు గురువారం వచ్చిన ఆమె రాజశేఖర్‌నగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీసీలకు 42శాతం రిజర్వేషన్లు దక్కేలా బిల్లు అమలుకు కేంద్రం సహకరించాలని కోరారు. కాగా, పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తమ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికే బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా పేరుతో విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని తెలిసినా, రైతులను పక్కదారి పట్టించేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు తమను తప్పు పడుతున్నారని పేర్కొన్నారు. కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు త్వరలో మరమ్మతులు చేయిస్తామని, రాష్ట్రంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు చెరుకూరి కిరణ్, శీలం వెంకటనర్సిరెడ్డి, సూర్యదేవర శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క