
విద్యుదాఘాతంతో వ్యక్తికి తీవ్రగాయాలు
సత్తుపల్లిరూరల్: విద్యుదాఘాతంతో ఓ వ్యక్తికి తీవ్రగాయాలైన ఘటన మండలంలోని సత్యనారాయణపు రం గ్రామంలో చోటుచేసుకుంది. గంగారం గ్రామానికి చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ కార్తీక్ పాకలగూడెం లైన్‌మెన్ లక్ష్మీనారాయణ వద్ద ప్రైవేట్ గా పనిచేస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి సత్యనారాయణపురం, ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలోని కోనరావుపాలెం వద్ద త్రీఫేజ్ పొలాలకు వెళ్లే విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో స్తంభంపైకి ఎక్కి మరమ్మతులు చేస్తున్నాడు. అదే సమయంలో విద్యుత్ సరఫరా కావటంతో షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
చేతికందిన పత్తి పంట ధ్వంసం
కారేపల్లి: చేతికందిన పత్తి పంటను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన మండలంలోని గేటురేలకాయలపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. బాధిత రైతు కథనం ప్రకారం.. గేటురేలకాయలపల్లి గ్రామానికి చెందిన పోడురైతు ధర్మసోతు సూర్య తనకున్న 2 ఎకరాల పోడు భూమిలో పత్తి పంట సాగు చేస్తున్నాడు. ఎకరానికి రూ.లక్ష పెట్టుబడి పెట్టి, పత్తి పంటను సాగు చేయగా.. కాయ దశకు చేరుకుంది. ఇంకా నెలరోజుల్లో పత్తి పంట చేతికందుతుందనుకున్న దశలో గుర్తుతెలియని వ్యక్తులు పత్తి పంటను వాహనాలతో ధ్వంసం చేశారు. మొక్కలను వేర్లతో సహా పెకిలించి పడేయడంతో కష్టపడి, రూ.2లక్షలు పెట్టుబడి పెట్టి పంట సాగుచేస్తే.. నేలమట్టం చేశారని బాధిత రైతు కుటుంబం కన్నీరుమున్నీరైంది. 30ఏళ్లుగా పోడు వ్యవసాయం చేస్తున్నామని, ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు రావాల్సి ఉందని, సర్వేలు సైతం పూర్తయ్యాయని, ఈ క్రమంలోనే అటవీశాఖ అధికారులు రాత్రివేళలో వచ్చి పత్తి పంటను ధ్వంసం చేశారని ఆరోపిస్తూ.. కారేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

విద్యుదాఘాతంతో వ్యక్తికి తీవ్రగాయాలు