
కమ్యూనిస్టుల త్యాగాలతోనే విలీనం
ఖమ్మంమయూరిసెంటర్: కమ్యూనిస్టుల త్యాగాలతోనే దేశంలో తెలంగాణ విలీనమైందని సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు అన్నారు. తెలంగాణ పోరాట చరిత్ర, కమ్యూనిస్టుల త్యాగాలను వక్రీకరిస్తే జాతి క్షమించదన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవ ముగింపు సభ బుధవారం నగరంలోని జెడ్పీ మీటింగ్‌హాలు లో నిర్వహించారు. అంతకుముందు పాత బస్టాండ్ నుంచి జెడ్పీ వరకు భారీ ప్రదర్శన చేయగా.. జనసేవాదళ్ కార్యకర్తలు కవాతు నిర్వహించారు. ఆ తర్వాత జిల్లా కార్యదర్శి దండి సురేశ్ అధ్యక్షతన జరిగిన సభలో హేమంతరావు మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటం నాటి సామాజిక, ఆర్థిక పరిస్థితుల పట్ల అవగాహన లేని వారు ఇది మతపరమైన పోరాటంగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ముస్లిం అయినప్పటికీ ఆయన కింద ఉన్న జమిందార్లు, జాగీరుదారులు, పటేల్, పట్వారీలు 95 శాతం హిందువులేనన్నారు. వీరి చేతుల్లోనే ఎక్కువ భూమి ఉండేదని, గ్రామీణ ప్రాంతాల్లో వీరి అరచాకాలు ఎక్కువగా ఉండి ప్రజల మాన, ప్రాణాలు, ఆస్తులకు రక్షణ ఉండేది కాదని తెలిపారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జమ్ముల జితేందర్‌రెడ్డి, మహ్మద్ మౌలా నా, యర్రా బాబు, ఎస్.కె. జానీమియా, ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, సిద్ధినేని కర్ణకుమార్, బి.జి.క్లెమెంట్, మహ్మద్ సలాం, అజ్మీర రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.