
ఆలయ అభివృద్ధే ప్రథమ ప్రాధాన్యం
స్వామివారి భూములను
కాపాడుకుంటాం
భక్తులకు సర్వ దర్శనం, వసతి సౌకర్యాలపై దృష్టి
మాస్టర్ ప్లాన్, పుష్కరాలపై ముందస్తు ప్రణాళికలు
సాక్షి ఇంటర్వ్యూలో రామాలయ ఈఓ కొల్లు దామోదర్ రావు
భధ్రాచలం: భద్రాద్రి రామయ్య చెంతకు వచ్చే భక్తులకు ప్రశాంత దర్శనం, సకల సౌకర్యాల కల్పన, దేవస్థానం అభివృద్ధే ప్రాధాన్యతగా విధులు నిర్వర్తిస్తానని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కొల్లు దామోదర్‌రావు తెలిపా రు. ఇటీవల ఈఓగా బాధ్యతలు స్వీకరించిన ఆయన బుధవారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
భక్తులకు సౌకర్యాల కల్పన
భద్రాచలం ఆర్డీఓగా పనిచేసి ఉండటంతో భద్రాచలం, దేవస్థానంపై అవగాహన ఏర్పడింది. దీంతో పాటు ఆలయ అభివృద్ధిలో కీలకమైన మాఢ వీధుల విస్తరణలో భూ సేకరణ చేసి నిర్వాసితులకు నష్టపరిహారం అందజేశాం. ఇప్పుడు ఆలయ ఈఓగా అదే అభివృద్ధిని కొనసాగించేందుకు కృషి చేస్తా. ఇప్పటికే భక్తులకు అందుతున్న ఆన్‌లైన్ సౌకర్యాలను ఇతర విభాగాలకూ విస్తరించేలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇక ప్రధానంగా రామాలయంలో నిర్వహించే సేవలు, ఆలయ ప్రాశస్త్యంపై ప్రచార లోపం ఉందనే అపోహలు తొలగించేందుకు ఆ సేవలు, ఇతర హోర్డింగ్‌లను భద్రాచలంతోపాటు మారుమూల ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. రంగనాయకుల గుట్టపై నిరుపయోగంగా ఉన్న టీటీడీ, అన్నవరం సత్రాలను పూర్తిగా తొలగించి ఉన్నతాధికారుల సూచనల మేరకు భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు రూ పొందిస్తున్నాం. రామాలయం, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యలు తొలగించి క్లీన్ భద్రగిరిగా ఉంచేందుకు కృషి చేస్తా.
మాస్టర్ ప్లాన్, గోదావరి పుష్కరాలు..
ఇక ప్రభుత్వం సంకల్పించిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధిలో నా వంతు పాత్ర పోషిస్తా. ప్రధానంగా ఆలయం, ఉపాలయాల అభివృద్ధి, మార్పులు, చేర్పులపై ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ పండితులు, వైదిక కమిటీలతో సమన్వ యం చేసుకుంటూ వారి సలహాలు, సూచనల మేరకు ముందుకెళ్తాం. ఈ మేరకు ఇప్పటికే వారితో సంప్రదింపులు జరుపుతున్నాం. చర్చలు ముగిశాక కలెక్టర్, ఇతరులతో కలిసి తగిన నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందిస్తాం. ఆలయ అభివృద్ధితోపాటు భక్తులకు సౌకర్యాల కల్పనే ప్రధాన అజెండాగా పని చేస్తాం. 2027 గోదావరి పుష్కరా లకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటాం. గత పుష్కరాల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తుల రద్దీని తట్టుకునేందుకు తాత్కాలిక వెయిటింగ్ గదులు ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం మిథిలా స్టేడియం, ఇతర ప్రాంతా లను పరిశీలిస్తున్నాం. భక్తులకు సరిపడా లడ్డూలు, వీఐపీలకు ఇతర సేవలను దృష్టిలో ఉంచుకుని అధికారులు, సిబ్బంది సహాయ సహకారాలతో ఏర్పాట్లు చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తాం.
రాముడికి చెందిన భూములను చట్ట ప్రకారం కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా ఏపీలోని పురుషోత్తపట్నంలో రాముడి భూములు దేవస్థానానికి చెందేలా అన్ని పత్రాలు ఉన్నాయి. దీనిపై ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలించాం. వీటిని న్యాయపరంగానే దక్కించుకుంటాం. ఏపీలోని అన్ని శాఖల సహాయ సహకారాలతో ఈ భూములపై పోరాడుతాం. ఇతర ప్రాంతాలలో ఉన్న భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటాం. భక్తులకు సేవ చేసేందుకు రామయ్య కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా.