
మతాల మధ్య చిచ్చుకు కుట్ర
● సాయుధ రైతాంగ పోరాటానికి మతం రంగు పులుముతారా..? ● సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ
ఖమ్మంగాంధీచౌక్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్ వంటి శక్తులు మత పరమైన రంగు పులుముతున్నాయని సీపీఎం జాతీయ ప్రధా న కార్యదర్శి ఎం.ఎ.బేబీ విమర్శించారు. నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో బుధవారం రాత్రి జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభలో ఆయన మాట్లాడా రు. ఈ పోరాటంలో శ్రామికులు, కార్మికులు, రైతులు భాగస్వాములయ్యారని, మహిళల భాగస్వామ్యం కూడా గొప్పదని అన్నారు. తెలంగాణ సాయుధ పోరులో అనేక మంది ప్రాణత్యాగం చేశారని నివాళులర్పించారు. దున్నేవాడికే భూమి కావాలని భూ స్వాములకు ఎదురొడ్డి పోరాటం సాగిందని, దీని ఫలితంగానే లక్షలాది ఎకరాల భూములు పేదలకు పంచారని తెలిపారు. అయితే కేంద్రంలోని నేటి పాలకులు ఈ పోరాటానికి మతం రంగు పులుము తూ ముస్లింలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటం భావి తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. దీన్ని ముస్లింలకు – హిందువులకు మధ్య జరిగిన పోరాటమని కొందరు వక్రీకరిస్తూ విమోచన, విలీనం, విద్రోహం అనే పేర్లతో తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. హక్కులు, వెట్టి చాకిరీ నుంచి విముక్తి, అత్యాచారాల నిరోధంతో పాటు దున్నే వాడిదే భూమి నినాదంతో తెలంగాణ సాయుధ పోరాటం సాగిందని తెలిపారు. పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, నాయకులు బండి రమేష్, పొన్నం వెంకటేశ్వరరావు, కల్యాణం వెంకటేశ్వరరావు, వై.విక్రం, ఎం. సుబ్బారావు, బండి పద్మ తదితరులు పాల్గొన్నారు.