
హామీలన్నీ అమలు చేస్తున్నాం
ఖమ్మంసహకారనగర్: ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే అమలు చేయడం ప్రారంభించామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా బుధవారం ఆయన ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాల ద్వారా 2వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఉత్పత్తికి ప్రణాళికలు చేపట్టామన్నారు. ఇందిరా సౌర గిరి జలవికాసం పథకం కింద 2025 – 26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 550 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని, వారికి సోలార్ పంపుసెట్లు అందిస్తామని తెలిపారు. జిల్లాలో కొత్తగా 24,818 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు జారీ చేశామని చెప్పారు.
70వేల మందికి ఉచిత విద్య..
జిల్లాలో 1,257 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 70,257 మంది విద్యార్థులు ఉచితంగా చదువుకుంటున్నారని భట్టి తెలిపారు. ఆరోగ్య లక్ష్మి పథకం కింద 1,840 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 12,542 మంది గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు చిన్నారులు 35,282 మందికి పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు. ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా రూ.180 కోట్లతో మున్నేరు నదిపై తీగల వంతెన, రూ.130 కోట్లతో వైద్య కళాశాల భవన నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. రూ.139 కోట్లతో పది రెండు లేన్ల రోడ్లను నాలుగు వరుసల రహదారులుగా విస్తరిస్తామని అన్నారు. మధిర, సత్తుపల్లిలో రూ.34 కోట్ల చొప్పున ఖర్చు చేస్తూ 100 పడకల ఆస్పత్రులు, కల్లూరులో రూ.10.50 కోట్లతో 50 పడకల సీహెచ్‌సీ, పెనుబల్లిలో రూ.7.50 కోట్లతో 30 పడకల కమ్యూనిటీ సెంటర్‌ను పూర్తి చేసినట్లు తెలిపారు. అనంతరం పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను భట్టి సందర్శించి విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడారు. కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్‌దత్, అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డి, డీఆర్‌ఓ పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షా రైన, నాయకులు పోట్ల నాగేశ్వరరావు, కొండబాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అంకితభావంతో సేవలందించాలి
ఖమ్మంవైద్యవిభాగం: ప్రైవేట్ ఆస్పత్రుల వారు ప్రజారోగ్యం పట్ల అంకిత భావంతో సేవలు అందించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. బుధవారం ఆయన వైద్యాధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉందని, ఎన్ని అవాంతరాలొచ్చినా ప్రజలకు ఇబ్బంది కావొద్దనే లక్ష్యంతో చాలా ఆస్పత్రులను ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ పరిధిలో చేర్చుకుందని తెలిపారు. జిల్లా స్థాయిలో కో–ఆర్డినేటర్ల ద్వారా మానిటరింగ్ చేస్తూ రూ.కోట్ల బడ్జెట్‌ను కేటాయించిందన్నారు. ప్రతి ప్రైవేట్ ఆస్పత్రి పొల్యూషన్ బోర్డ్ సర్టిఫికెట్, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో నాణ్యతలు పాటించాలని, పేషెంట్‌తో పాటు అతడితో వచ్చే వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని, వైద్య సేవలకు, సర్జరీలకు తీసుకునే చార్జీల వివరాలను అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని సూచించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం నియమ, నిబంధనలు ప్రైవేట్ ఆస్పత్రులు పాటిస్తున్నాయా లేదా అని తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్‌దత్, అదనపు కలెక్టర్ డా.పి.శ్రీజ, డీఎంహెచ్‌ఓ బి.కళావతిబాయి, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ నరేందర్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ చందునాయక్, ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

హామీలన్నీ అమలు చేస్తున్నాం