
పేదల సంక్షేమానికి పెద్దపీట
మహిళా ఆరోగ్య పరిరక్షణకు కృషి
విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి
తిరుమలాయపాలెం: పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, మహిళల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ‘స్వస్థ్ నారీ.. సశక్త్ పరివార్’ కార్యక్రమాన్ని తిరుమలాయపాలెం మండల కేంద్రంలో బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు పెద్ద పీట వేస్తోందని, ఈ రెండు రంగాలకు పుష్కలంగా నిధులు వెచ్చిస్తోందని తెలిపారు. ఆడబిడ్డలకు అండగా నిలుస్తోందని, ప్రధానమంత్రి ఆలోచనలకు అనుగుణంగా వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆదుకుంటోందని చెప్పారు. వైద్యాధికారులు అంకితభావంతో పని చేయాలని, దూర ప్రాంతాల నుంచి రావడం, ఒక గంట సేపు ఉండివెళ్లడం వంటివి చేయొద్దని సూచించారు. వైద్యులు దేవుడితో సమానమని, రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. తిరుమలాయపాలెం ఏరియా ఆస్పత్రి 30 పడకల నుంచి 50 పడకలకు అప్‌గ్రేడ్ అయిందని, కొత్త స్కానింగ్, ఎక్స్ రే మిషన్లు, ఇతర పరికరకాలను ఈ నెలాఖరులోగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణకు చేపట్టిన స్వస్థ్ నారీ.. సశక్త్ పరివార్ కార్యక్రమాన్ని మొక్కుబడిగా కాకుండా చిత్తశుద్ధితో అమలు చేయాలని ఆదేశించారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆస్పత్రిలో అందుతున్న ఓపీ, ఐపీ సేవలను పరిశీలించారు. అనంతరం కంటి పరీక్షల యూనిట్, ఇతర ఓపీ సేవలను ప్రారంభించారు. ఆ తర్వాత పోషణ మాసం –2025 పోస్టర్‌ను పొంగులేటి ఆవిష్కరించారు. 21 మందికి కల్యాణలక్ష్మి/షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం రూ.1.50 కోట్లతో చేపట్టనున్న తిరుమలాయపాలెం – ములకలపల్లి హై లెవల్ బ్రిడ్జి అప్రోచ్ మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు.
ఉద్యమంలా చేపట్టాలి..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్వస్థ్ నారీ–సశక్త్ పరివార్ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ప్రతీ మహిళ, పిల్లలు పరీక్షలు చేయించుకునేలా ఆశ కార్యకర్తలు అవగాహన కల్పించాలన్నారు. వ్యాధులు రాకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. స్పెషలిస్ట్ వైద్యులతో క్యాంపులు నిర్వహించి ఉచిత పరీక్షలు, చికిత్స అందిస్తారని అన్నారు. కార్యక్రమంలో సీపీ సునీల్‌దత్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి, డీసీహెచ్‌ఎస్ రాజశేఖర్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ చందూనాయక్, వైద్యాధికారులు డాక్టర్ కృపా ఉషశ్రీ అమర్‌సింగ్, బొల్లికొండ శ్రీనివాసరావు, వైదేహి, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, పీఆర్ ఎస్‌ఈ వెంకట్‌రెడ్డి, డీఈ వేణుగోపాల్ డీపీఓ రాంబాబు, తహసీల్దార్ విల్సన్, ఎంపీడీఓ సిలార్ సాహెబ్, ఆత్మ చైర్మన్ చావా శివరామకృష్ణ, రామసహాయం నరేష్‌రెడ్డి, బెల్లం శ్రీనివాస్, మాజీ ఎంపీపీలు కొప్పుల అశోక్, మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.